Begin typing your search above and press return to search.

మూడు పార్టీలు కలవాలని కోరుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   24 Oct 2022 12:30 PM IST
మూడు పార్టీలు కలవాలని కోరుకుంటున్నారా?
X
వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని జనాలు కోరుకుంటున్నారా ? కోరుకుంటున్నట్లు బీజేపీ మాజీ ఎంఎల్ఏ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు. మీడియాతో మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని రాష్ట్రంలోని జనాల్లో 95 శాతం మంది కోరుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే పై మూడుపార్టీలు కలవాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

ప్రజల మనోగతం తమ పార్టీ రాష్ట్ర ఇన్చార్జికి బాగా తెలుసన్నారు. అయినా పొత్తుల విషయం కేంద్రనాయకత్వం చూసుకుంటుందన్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వం ఆచరిస్తుందని చెప్పారు. తాజాగా రాజు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయనకు టీడీపీతో కలిపి పోటీచేయాలన్న కోరిక బలంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. మొదటినుండి కూడా పొత్తువిషయంలో బీజేపీలో రెండురకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవర్గం నేతలేమో టీడీపీతో పొత్తుకు మొగ్గుచూపుతున్నారు. అయితే మరికొందరు నేతలేమో టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండువర్గాల నేతలమధ్యే పొత్తు విషయంలో ఏకాభిప్రాయం కుదరటంలేదు. దాంతో పొత్తుపై ఎప్పుడు మీటింగ్ జరిగినా భిన్నాభిప్రాయాలు వస్తునే ఉన్నాయి. కాకపోతే ఆ అభిప్రాయాలను బయటకు వినబడకుండా అంతర్లీనంగానే తొక్కిపెట్టేస్తున్నారు.

నిజానికి పొత్తు విషయంలో రాష్ట్రస్ధాయిలోని నేతలు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తంచేసినా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం కేంద్ర నాయకత్వమే అన్న విషయం తెలిసిందే.

కేంద్ర నాయకత్వం మాత్రం ఇంతవరకు ఈ విషయమై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తంచేయలేదు. కేవలం జనసేనతో మాత్రమే పొత్తుంటుందని చెబుతోంది. ఇపుడా పొత్తుకూడా సందేహంలో పడింది. ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకపోరాటంలో జనసేన, టీడీపీ చేతులు కలిపాయి.

దాంతో బీజేపీ అగ్రనేతలు పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంతకీ రాజుగారి సమస్య ఏమిటంటే బీజేపీ+జనసేన పోటీచేసినా లేదా బీజేపీ ఒంటరిగా పోటీచేసినా తనకు డిపాజిట్లు కూడా రావని భయం మొదలైనట్లుంది. అందుకనే మూడుపార్టీలు కలవాలని కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.