Begin typing your search above and press return to search.

కడప ప్రజలు జగన్ కు ఓటు వేస్తారు కానీ ఆయన మాటను నమ్మరా?

By:  Tupaki Desk   |   5 Aug 2022 5:47 AM GMT
కడప ప్రజలు జగన్ కు ఓటు వేస్తారు కానీ ఆయన మాటను నమ్మరా?
X
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఒక కాన్సెప్టు చెప్పి.. దానికి అవసరమైన భూమి కావాలని అడిగితే.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. హారతులు.. మేళతాళాలతో తమ భూముల్ని ఇచ్చేయటం ఎక్కడైనా చూశారా? మరెక్కడైనా కనిపించిందా? అని ప్రశ్న వేస్తే.. ఏపీ అన్న సమాధానం మాత్రమే వచ్చే పరిస్థితి.

అందునా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 30వేల ఎకరాలు కావాలని అడిగితే.. వెనుకా ముందు చూసుకోకుండా.. ముఖ్యమంత్రి హోదాలో బాబు చెప్పిన మాటల్ని విని.. ఇచ్చేయటం మళ్లీ సాధ్యం కాదేమో? అంతటి నమ్మకం చంద్రబాబు మాట మీద ప్రజలకు అన్న దాని కంటే.. డెవలప్ మెంట్ కోసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అధినేత అడగాలే కానీ.. ఇవ్వటానికి ఏపీ ప్రజలు అస్సలు వెనుకాడరన్న విషయాన్ని మర్చిపోకూడదు.

బ్యాడ్ లక్ ఏమంటే.. ఏపీ రాజధాని కోసం అమరావతి ప్రజలు ముందుకు వచ్చినా.. దరిద్రపుగొట్టు రాజకీయం పుణ్యమా అని వారి త్యాగాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. రాజకీయం ఎంత ఉన్నా.. కొన్ని అంశాల విషయంలో దాన్ని దగ్గరకు రానివ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. రాజధానిగా అమరావతి పూర్తి అయితే.. ఒక సామాజిక వర్గానికి తిరుగులేని అధిక్యత ఉంటుందన్న ప్రచారంతో పాటు.. రాజధానిని మూడు ప్రాంతాలకు సమంగా పంచటం ద్వారా.. డెవలప్ మెంట్ ను సమానంగా పంచినట్లు అవుతుందన్న మాటల్లో ఉన్నంత తియ్యదనం.. వాస్తవంలో లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర మూడున్నరేళ్లు దాటుతోంది. మరి.. రాజధానికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత పవర్లోకి వచ్చిన చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారన్న ప్రశ్నను చాలామంది సంధిస్తుంటారు. మరి ఇప్పుడు నడుస్తున్న అసెంబ్లీ.. సచివాలయం.. హైకోర్టు ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినవి? అన్నది ప్రశ్న. మరి..జగన్ మూడున్నరేళ్ల పాలనలో అలాంటి భవనాలు కనీసం ఒకట్రెండు అయినా పూర్తి అయ్యాయా? అన్నది కూడా క్వశ్చనే. దీనికి ఏమని బదులిస్తారు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు.

ఇదంతా ఎందుకంటే.. అమరావతి కోసం ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు వేలాది ఎకరాలు ఇచ్చేసి.. రాష్ట్ర భవిష్యత్తు కోసం తపిస్తే.. అందుకు భిన్నంగా చోటుచేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాటల్లో అయితే మరింత బాగుంటుంది. తాజాగా ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. అమరావతి రైతుల్ని మోసం చేయటం రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద దుర్మార్గంగా అభివర్ణించారు. అంతేకాదు.. రాజధాని రైతుల్ని మోసం చేయటమంటే.. తల్లి.. చెల్లి.. భార్యను మోసం చేసినట్లేనని పేర్కొన్నారు.

అంతేకాదు.. అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇస్తానని చెప్పిన జగన్.. తన మాటల్ని మరోసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు జగన్ చెప్పింది ఒకటైతే.. తర్వాత మరొకటి అంటూ మండిపడ్డారు. అంతేకాదు.. పులివెందులలో భూసమీకరణ కోసం సీఎం జగన్ పిలుపునిస్తే.. అక్కడి ప్రజలు ఒక్క ఎకరం ఇచ్చేందుకు సైతం ముందుకు రాకపోవటాన్ని ప్రస్తావించారు. ఇదంతా చూసినప్పుడు కడప జిల్లా ప్రజలు జగన్ కు ఓట్లు వేటయానికి ముందుంటారు కానీ.. ఆయన మాటల్ని నమ్మేందుకు మాత్రం సిద్దంగా ఉండరా? అన్న సందేహానికి తావిచ్చేలా విష్ణుకుమార్ రాజు మాటలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.