Begin typing your search above and press return to search.

పవన్, చంద్రబాబు భేటీ పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   9 Jan 2023 4:59 AM GMT
పవన్, చంద్రబాబు భేటీ పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!
X
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తాజా భేటీపై ఏపీ రాజకీయాల్లో సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై అధికార వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. చంద్రబాబు, పవన్‌ ముసుగు తీశారని, పవన్‌ ప్యాకేజీ స్టార్‌ అని నిప్పులు చెరుగుతున్నారు.

మరోవైపు జనసేన పార్టీతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీలో చంద్రబాబు, పవన్‌ భేటీ కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయని.. తాము మిగతా ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని ఇప్పటికే తేల్చిచెప్పారు. వైసీపీ, టీడీపీ రెండూ కుటుంబ పార్టీలేనని, రెండు అవినీతి పార్టీలేనని బీజేపీ నేతలు గతంలోనే మండిపడ్డారు.

జనసేనతోనే తాము ఎన్నికల్లో కొనసాగుతామని.. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు ఇదే విషయం స్పష్టం చేశారని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తాజా భేటీపై ఆ పార్టీలో అసహనం వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

తాజాగా చంద్రబాబుతో పవన్‌ భేటీపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ చానెల్‌ తో మాట్లాడుతూ గతంలో విశాఖలో పవన్‌ కల్యాణ్‌ ను పోలీసులు అడ్డుకున్నప్పుడు చంద్రబాబు వెళ్లి సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు.

అలాగే కుప్పంలో పర్యటించిన చంద్రబాబును పోలీసులు అడ్డగించడంతో పవన్‌ కూడా ఆయన వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారన్నారు. అంతే తప్ప వీళ్ల భేటీకి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పొత్తు, సీట్లపై మాట్లాడుకున్నారని మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

అయితే పవన్‌ కల్యాణ్‌ పై ప్రత్యర్థులు సోషల్‌ మీడియా, ప్రధాన మీడియాలో సాగిస్తున్న ప్రచారంతో తప్పకుండా పవన్‌ కు నష్టం కలుగుతుందని విష్ణువర్దన్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ లాంటి బలమైన నాయకుల్ని ఈ భేటీ బలహీనపరిచే ప్రమాదం ఉందని విష్ణువర్దన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ పాలనపై ప్రజావ్యతిరేకత ఉందని విష్ణువర్దన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ పార్టీలను ప్రజలు ఎన్నుకోరని తెలిపారు. బీజేపీ-జనసేనకు అవకాశం ఇస్తారన్నారు. అలాగే తమలో ఒకర్ని సీఎంగా చూడాలని కాపులు కోరుకుంటున్నారని విష్ణువర్దన్‌ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటేనే కాపుల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు.

బీజేపీతో జనసేన పొత్తులో ఉంటేనే పవన్‌కు ముఖ్యమంత్రి అవకాశం వస్తుందని విష్ణువర్దన్‌ రెడ్డి వెల్లడించారు. టీడీపీతో వెళితే ఆ అవకాశం ఉండదని తెలిపారు.. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు రెడ్లు, కమ్మలు పాలించారనన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.