Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నోళ్లను పిలిచిమరీ టికెట్‌ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   12 Jun 2015 5:16 AM GMT
కేసీఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నోళ్లను పిలిచిమరీ టికెట్‌ ఇస్తాడా?
X
ఎట్టకేలకూ కడియం శ్రీహరి రాజీనామా చేశాడు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన వరంగల్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయం అయ్యింది. ఎమ్మెల్సీ హోదాను పొందిన కడియం ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ ఉప ఎన్నికపై అందరి దృష్టీ నెలకొంది. సమీపకాలంలోనే ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.

తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టుగొమ్మలాంటి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీ తరపు అభ్యర్థి ఎవరవుతారు? అనేదే అత్యంత ఆసక్తికరమైన అంశం. ఏ విధంగా చూసినా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. ఆ మాత్రం అనుకూలత లేకపోతే కడియం చేత రాజీనామా చేసేంత సాహసం చేయలేడు తెరాస అధినేత.

మరి ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వరంగల్‌ నుంచి తెరాస అభ్యర్థిగా కాంగ్రెస్‌లో ఉన్న వివేక్‌ బరిలోకి దిగే అవకాశం ఉండటం. ఎన్నికల ముందు తెరాసలోకి వచ్చి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకా వివేక్‌ తిరిగి కాంగ్రెస్‌ లోకి వెళ్లిపోయాడు. అయినా ఆయన విషయంలలో తెలంగాణ సీఎం సానుకూలంగానే ఉన్నాడట.

ఇటువంటి నేపథ్యంలో వరంగల్‌ నుంచి వివేక్‌ తెరాస తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా వివేక్‌ అభ్యర్థిత్వం ఖరారు అయినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.

మరి ఇన్ని రోజులూ కేసీఆర్‌ తన ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రాతినిధ్యపు హోదా ఉన్న వారినే తెచ్చుకొన్నాడు. ఇప్పుడు తన పార్టీ తరపున పోటీ చేయడానికి మాజీ కాంగ్రెస్‌ ఎంపీలను కూడా తెచ్చుకోవడం విడ్డూరమే కదా!