Begin typing your search above and press return to search.

వివేకా మర్డర్ కేసులో గంగిరెడ్డికీ నార్కో... గుట్టు వీడేనా?

By:  Tupaki Desk   |   12 July 2019 1:56 PM GMT
వివేకా మర్డర్ కేసులో గంగిరెడ్డికీ నార్కో... గుట్టు వీడేనా?
X
ఇటీవల ముగిసిన ఎన్నికలకు ముందు తెలుగు నేలలో పెను కలకలం రేపిన వైసీపీ సీనియర్ నేత - ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇంకా సాగుతూనే ఉంది. జగన్ సొంతూరు పులివెందులలోని తన సొంతింటిలోనే వివేకా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో రాత్రి పొద్దుపోయే దాకా బిజీబిజీగా తిరిగి వచ్చి రాత్రి ఇంటిలో నిద్రకు ఉపక్రమించిన వివేకా.. ఉదయానికంతా రక్తపు మడుగులో శవమై పడి ఉన్నారు. ఈ హత్యను జగన్ కుటుంబం పైకే నెట్టేసేందుకు యత్నించిన టీడీపీ సర్కారు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏదో సిట్ వేశామంటే వేశామన్నట్లుగా దర్యాప్తును పెద్దగా పట్టించుకోనే లేదని చెప్పాలి.

అయితే ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించడంతో ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన బాబాయి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ ను రద్దు చేసి కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు వేగంగానే సాగుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు కీలక నిందితులకు నార్కో అనాలసిస్ టెస్టులు నిర్వహించేందుకు కోర్టు నుంచి సిట్ అనుమతి సాధించగా... ఈ కేసులో అత్యంత కీలక నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి కూడా నార్కో టెస్టులు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. ఇదివరకే కోర్టు అనుమతించిన మేరకు వాచ్ మన్ రంగయ్య - కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డిలను హైదరాబాద్ తరలించిన పోలీసులు వారికి నార్కో టెస్టులు నిర్వహించారు.

తాజాగా నేటి విచారణలో భాగంగా గంగిరెడ్డికి కూడా నార్కో టెస్టులకు పులివెందుల కోర్టు అనుమతించడంతో ఆయనను కూడా సిట్ బృందం ఈ రాత్రికే హైదరాబాద్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. విచారణలో భాగంగా అసలు విషయాలు చెప్పేందుకు నిందితులు సతాయిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు నార్కో టెస్టులకు అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. మొన్నటిదాకా నార్కో టెస్టులకు అనుమతి విషయంలో అంతగా సుముఖంగా లేని కోర్టు కూడా ఇప్పుడు కొత్త సిట్ వినిపిస్తున్న వాదనలు సరైనవేనన్న కోణంలో నార్కో టెస్టులకు అనుమతించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ టెస్టుల ద్వారా అయినా వివేకా మర్డర్ మిస్టరీ వీడకపోతుందా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.