Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసు: సీబీఐ పై అనుమానాలు: హైకోర్టు కీలక ఆదేశాలు..

By:  Tupaki Desk   |   7 Jan 2022 7:30 AM GMT
వివేకా హత్య కేసు: సీబీఐ పై అనుమానాలు: హైకోర్టు కీలక ఆదేశాలు..
X
వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా హత్యకేసుకు సంబంధించిన సీబీఐకి హైకోర్టు పలు ఆదేశాలను జారీ చేసింది. దిగువ కోర్టులో దాఖలు చేసిన సాక్సాలు, వాంగ్మూలాలు, విచారణ వివరాలు అప్పగించాలని తెలిపింది. వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అనుమతినిస్తూ కడప కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో హైకోర్టులో మరో నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో కడప కోర్టులు జరిపిన విచారణ వివరాలు తమకు అందించాలని న్యాయమూర్తి మానవేంద్ర రాయ్ ఆదేశించారు.

నిందితుడు ఒకసారి వాంగ్మూలం ఇచ్చాక.. మరోసారి అప్రూవర్ గా మారాల్సిన అవసరం లేదని పిటిషనర్ల తరుపున న్యాయవాదులు ఆదినారాయణరావు, నిరంజన్ రెడ్డిలు వాదించారు. అలాగే ఎలాంటి సాక్ష్యాధారాలు లేనప్పుడే అప్రూవర్ గా మారుతారన్నారు. కానీ ప్రస్తుత కేసులో సాక్ష్యాలు ఉన్నాయని, ఈ సమయంలో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు..దిగువ కోర్టులో సీబీఐ ప్రాథమిక అభియోగ పత్రాలను దాఖలు చేసిందని అలాంటప్పుడు అప్రూవర్ ఎలా అవసరం ఉంటుందని న్యాయవాదులు వాదించారు.

డ్రైవర్ దస్తగిరికి క్షమాభిక్ష పెట్టి కడప కోర్టు సీఆర్ పీసీ నిబధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. గతంలో ఈ కేసును పోలీసులు విచారించిన తరువాత దస్తగిరిని నిందితుడిగా పేర్కొనలేదన్నారు. సిబీఐ దర్యాప్తు దరువాతనే దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అంతేకాకుండా దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ సహకరించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా కడప కోర్టులో పిటిషన్ వేశారని, అయితే సీబీఐ తీరుపై అనుమానాలున్నాయని అన్నారు.

పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదిని ప్రశ్నించగా.. సీబీఐ తరుపున న్యాయవాది చెన్నకేశవులు మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలతో పాటుగా ఎఫ్ఐఆర్.. చార్జ్ షీట్..స్టేట్ మెంట్లను కడప కోర్టులో సమర్పించామన్నారు. వాటిని పరిగణలోకి తీసుకున్న తరువాతే న్యాయస్థానం అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. అయితే సీబీఐ తరుపున న్యాయవాది వాదనలు విన్న తరువాత సీబీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎంత మంది సాక్షులను విచారించారు..? నేర నిరూపణకు అవి సరిపోతాయా..? వాటిపైన స్పష్టత రావాలంటే కడప కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ తో పాటు చార్జ్ షీట్ వాంగ్మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారీ చేసింది.

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. శంకర్ రెడ్డి ఐదో వ్యక్తిగా ఉన్నారు. వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలంతో దర్యాప్తును వేగం చేసింది. ఇప్పటి వరకు ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరిలను అరెస్టు చేయగా వారు బెయిల్ పై బయటికొచ్చారు. అలాగే సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలను అరెస్టు చేయగా వారు జైలులో ఉన్నారు. తాజాగా శంకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ తాజాగా భరత్ యాదవ్ పేరును తీశాడు. ఈ భరత్ యాదవ్ వివేకా హత్యలో కీలక సూత్రధారి సునీత భర్త రాజశేఖర రెడ్డినేంటూ బాంబు పేల్చాడు. వివేకా హత్య చేయించింది.. నిందితులకు డబ్బులు ఇచ్చింది సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇది ఒక ఆస్తి తగాదా అని.. వైఎస్ వివేకా సన్నిహితురాలు షమీమ్ కు మామ గారి ఆస్తి మొత్తం వెళుతుందనే కోణంలోనే ఈ హత్య జరిగిందని భరత్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ యాదవ్ నేరుగా తనతో ఈ హత్య వివరాలు వెల్లడించినట్టు భరత్ యాదవ్ చెబుతున్నాడు. ప్రాణభయంతోనే తాను ఈ విషయం చెప్పలేదన్నారు. తాజాగా నిందితులు హైకోర్టుకు ఎక్కడం.. సీబీఐకి ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది..