Begin typing your search above and press return to search.

వివేక హత్య కేసులో ఒకరోజులో ఇంత జరిగింది

By:  Tupaki Desk   |   12 Aug 2021 4:57 AM GMT
వివేక హత్య కేసులో ఒకరోజులో ఇంత జరిగింది
X
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు.. తన ఊళ్లో.. తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. తొలుత ఆయన అనారోగ్యానికి గురైనట్లు.. బాత్రూంలో జారిపడినట్లుగా వార్తలు రావటం.. కాసేపటికి దారున హత్యకు గురైనట్లుగా తేలటం తెలిసిందే. వివేకా లాంటి నేత హత్యకు గురైన తర్వాత.. విచారణ వాయు వేగంతో జరుగుతుందని ఆశిస్తారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారని భావిస్తాం. అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం.. వివేక కుమార్తె డాక్టర్ సునీత.. స్వయంగా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వివేక హత్య కేసు విచారణ విషయంలో సీబీఐ యాక్టివ్ గా వ్యవహరించటం లేదన్న విమర్శ అంతకంతకూ ఎక్కువైంది. ఇలాంటివేళ.. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. తాజాగా బుధవారం ఒక్కరోజులో వారు చేసిన పనులు.. చేపట్టిన విచారణ క్రమం చూస్తే.. కేసు చురుగ్గా సాగుతుందన్న భావన కలుగక మానదు. రీల్ సీన్లను తలపించేలా విచారణ సీన్లు ఉన్నాయని చెప్పాలి. బుధవారం ఉదయం నుంచి రాత్రి మధ్యలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కడప సెంట్రల్ జైల్లోని గెస్టు హౌస్ కు కర్నాటక నుంచి 20 వాహనాల్లో 40 మంది బ్యాంకు అధికారులు.. రెవెన్యూ సిబ్బంది వచ్చి.. సీబీఐ అధికారుల్ని కలిశారు. వివేకాకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు.. రెవెన్యూ రికార్డుల వివరాల్ని అందజేశారు. అనంతరం వారు సీబీఐ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు కడప ఎస్ బీఐకి చెందిన ముగ్గురు అధికారుల్ని సీబీఐ తాజాగా ప్రశ్నించింది. వివేకా మొదట గుండెపోటు తోమరణించారని ఎలా చెప్పా రని వారిని ప్రశ్నించినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధిని కూడా పిలిచి ఇదే ప్రశ్నే అడిగినట్లు తెలుస్తోంది. గుండెపోటుతో అని ఎలా వార్తలు ప్రసారం చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది.

వివేక కుమార్తె సునీత.. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలుకూడా సీబీఐ అధికారుల్ని కడపలో మరోసారి కలిశారు. వివేక హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ ఇంట్లో మరోసారి సీబీఐ టీం సోదాల్ని నిర్వహించింది. ఇప్పటికే సీబీఐ అధికారులపై సునీల్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే. వారు డబ్బులకు అమ్ముడుబోయారని.. తన భర్తను తీవ్రంగా హింసిస్తున్నారని.. అతనిపై పెట్టిన కేసులను ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించటం తెలిసిందే.

తాజాగా జరిపిన సోదాల్లో ఇంటిని సీబీఐ అధికారుల టీం చిందరవందర చేసిందని సునీల్ సోదరుడు కిరణ్ యాదవ్ ఆరోపిస్తున్నారు. తాము వివేకాను హత్య చేసేటోళ్లం కాదన్న అతను.. తమను అధికారులు వేధిస్తున్నారన్నారు. సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఒక పాత చొక్కాను.. బ్యాంకు పాస్ పుస్తకాల్ని తమతో తీసుకెళ్లినట్లుగా చెప్పారు. సునీల్ స్వగ్రామం కోమనూతనపల్లెలోనూ సోదాలు నిర్వహించటం గమనార్హం. ఈ సోదాలకు సునీల్ తల్లిని.. సోదరుడ్ని తమ వెంట సీబీఐ అధికారులు తీసుకెళ్లారు.

పులివెందులలో వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదే పట్టణానికి చెందిన పాల వ్యాపారి ఉమాశంకర్ రెడ్డి.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఇంట్లోనూ సోదాలు నిర్వహించి అతడి బ్యాంకు పుస్తకాల్ని.. ఐదు కత్తుల్నిస్వాధీనం చేసుకున్నారు.అతన్ని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డిని సీబీఐ అధికారులు పిలిపించి.. విచారించారు. ఇదంతా చూస్తున్నప్పుడు గతానికి భిన్నంగా వివేకా హత్య కేసు ఉదంతంలో సీబీఐ జోరును పెంచిందన్న మాట వినిపిస్తోంది.