Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో ఊగిసలాట.. సీబీఐకి అప్పగిస్తారా లేదా?

By:  Tupaki Desk   |   14 Feb 2020 10:15 AM GMT
వివేకా హత్య కేసులో ఊగిసలాట.. సీబీఐకి అప్పగిస్తారా లేదా?
X
మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై దాదాపు ఏడాదవుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో పురోగతి సాధించలేదు. కోర్టుల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మినహా ఒక్కర్ని అరెస్ట్ చేయలేదు. తాజాగా ఈ కేసుపై గురువారం అమరావతిలోని హైకోర్టులో విచారణ సాగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు సందేహాలను లేవనెత్తారు. అయితే ఈ కేసులో ఒక్క సాక్ష్యాన్ని కూడా పోలీసులు సంపాదించలేకపోయారని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. పోలీసులపై నమ్మకం లేక ఈ కేసును సీబీఐకి - లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిట్‌కు అప్పగించినా దర్యాప్తు సక్రమంగా సాగే అవకాశం లేదని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని చెప్పారు. పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని భావించిన పక్షంలో కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించవచ్చని గతంలో సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిన అంశాన్ని గుర్తుచేశారు.

వివేకా హత్య కేసును సీబీఐకి - లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని కోరుతూ గతంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ - నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ - టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి - మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వివేకా కుమార్తె డాక్టర్‌ ఎన్‌.సునీత - అల్లుడు ఎన్‌.రాజశేఖర్‌ రెడ్డి కూడా ఈ విషయమై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ముందు విచారణ జరిగింది. సౌభాగ్యమ్మ - సునీతల తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి - ఆదినారాయణ రెడ్డి - బీటెక్‌ రవిల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఆర్‌.బసంత్‌ - సల్మాన్‌ ఖుర్షీద్‌ - జగన్‌ తరఫున వివేక్‌ వాదనలు వినిపించారు.

విచారణ ప్రారంభం కాగానే జగన్‌ తరఫు న్యాయవాది వాదించారు. వివేకా హత్యకేసులో గత ప్రభుత్వం సరైన దర్యాప్తు చేయించకపోవడంతో సీబీఐకి ఇవ్వాలని అప్పట్లో జగన్‌ పిటిషన్‌ వేశారని - అయితే ప్రస్తుతం దర్యాప్తు సక్రమంగా సాగుతోందని, తమ పిటిషన్‌ పై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే వివేకా హత్య కేసును దర్యాప్తుకు తమకెలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తెలిపింది. అయితే విచారణ సందర్భంగా న్యాయమూర్తి పలు సందేహాలు వ్యక్తం చేశారు. సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదిస్తూ.. వివేకా హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ సీబీఐ విచారణ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేయగా ఇప్పుడు అదే కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె ఎన్నిమార్లు కోరినా పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు.

వివేకా మృతదేహం విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 8 అడుగుల మేర రక్తపు మడుగులో మృతదేహం పడి ఉందని - కానీ మంచంపై ఎలాంటి రక్తపు మరకలు లేవని తెలిపారు. అంటే ఎవరో ఆయన్ని బాత్రూంలోకి తీసుకెళ్లారని తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. వివేకా మృతదేహం వద్దకు మొదట ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి చేరుకోగా ఆ తరువాత బంధువులు వచ్చారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆ ప్రదేశానికి ఎవరూ రాకుండా తలుపులు మూసేసి, ఆ సమయంలో అక్కడ ముగ్గురు వైద్యులు - పారా మెడికల్‌ స్టాఫ్‌ - సీఐ - ఎస్సైతో పాటు మొత్తం 15 మంది ఉన్నారని చెప్పారు. వారంతా అక్కడున్న రక్తాన్ని శుభ్రం చేసి, గాయాలకు బ్యాండేజ్‌ కట్టి - మృతదేహాన్ని బెడ్‌ షీట్లో చుట్టి తొలిగా బెడ్‌ పైకి - ఆ తరువాత ఆస్పత్రికి చేర్చారని వివరించారు. అది హత్యేనని అందరికీ తెలిసే రక్తం శుభ్రం చేయించారని కోర్టుకు తెలిపారు.

అయితే ఈ విషయంలో అందరిపై కాకుండా ముగ్గురిపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మృతదేహం వద్ద నాలుగు లైన్లతో దొరికిన లేఖలో వివేకా సంతకంగా చెబుతున్నది తెలుగులో ఉంది. ఆయన తెలుగులో సంతకం చేయరని పేర్కొన్నారు. వివేకా సహాయకుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యలో కూడా ఎన్నో విషయాలు దాగున్నాయని తెలిపారు. నిజం తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించండి అని న్యాయవాది చెప్పారు.

అయితే దీనిపై ఆదినారాయణరెడ్డి తరఫు న్యాయవాది ఆర్‌.బసంత్‌ వాదిస్తూ ఈ కేసులో అమాయకుల్ని ఇరికించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఏజీ వాదనలు వినేందుకు కోర్టు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.