Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసు: ఐదుగురు ముఖ్య నేతల ప్రమేయం

By:  Tupaki Desk   |   21 Feb 2020 7:00 AM GMT
వివేకా హత్య కేసు: ఐదుగురు ముఖ్య నేతల ప్రమేయం
X
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కుటుంబసభ్యులు కోర్టుకు ఎక్కడంతో హైకోర్టు విచారణ చేపడుతోంది. ఈ సందర్భంగా గురువారం కూడా విచారణ జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారని, ఇందులో ముఖ్య నేతల జోక్యం ఉందని పిటిషనర్లు చెప్పడంతో అంతటా హాట్ టాపిక్ అయ్యింది. కుటుంబసభ్యులు సీబీఐకి ఫిర్యాదు చేయాలని కోరడం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరం లేదు.. విచారణ సాఫీగా సాగుతోందని ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో సీబీఐకి కేసు అప్పగించాలని కోరిన వైఎస్ జగన్ ఇప్పుడు అవసరం లేదని చెప్పడంలో ఆంతర్యమేంటనే ప్రశ్న మొదలవుతోంది.

విచారణ సందర్భంగా ఆసక్తికర చర్చ సాగింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన జగన్‌.. సీఎం అయ్యాక ఇప్పుడెందుకు తన పిటిషన్‌పై ఎలాంటి తీర్పు అవసరం లేదని చెబుతున్నారని ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగమంతా సీఎం చేతుల్లో ఉందని, దీంతోనే ఆయన కేసును తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ కేసులో నిజానిజాలు తేలాలంటే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు. మరోవైపు ద ర్యాప్తు సాఫీగా సాగుతోందని, ఎలాంటి అనుమానాలకు తావు లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందని, మరో రెండు నెలల్లోనే పూర్తవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఎంపై పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలపై వాదనలు వినిపించేందుకు జగన్‌ తరఫు న్యాయవాదికి అవకాశం కల్పించారు. వివేకా హత్య కేసులో జనరల్‌ డైరీ, కేసు డైరీలను తమ ముందుంచాలని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్ ను న్యాయమూర్తి కోరారు. వివేకా హత్య కేసును సీబీఐకి లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, నాటి ప్రతిపక్ష నేత జగన్‌, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు వివేకా కుమార్తె డాక్టర్‌ ఎన్‌.సునీత, అల్లుడు ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి కూడా ఈ విషయమై మరో పిటిషన్‌ వేశారు. వీటిన్నిటిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ఎదుట విచారణ జరిగింది. సౌభాగ్యమ్మ, సునీతల తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి, ఆదినారాయణ రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బసంత్‌, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. ఈ విచారణ సందర్భం గా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వివేకా హత్య కేసులో ఆయన సన్నిహిత బంధువు హస్తం ఉందని తమకు అనుమానం వ్యక్తం చేశారు. ఇవన్నీ తేలాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, ఇప్పటి వరకూ కనీసం ఒక్క క్లూ కూడా సిట్‌ సంపాదించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హత్య లో కొంతమంది శక్తి వంతమైన రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉంది సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర పాలనా యంత్రాంగమంతా సీఎం చేతిలో ఉండడంతో ఈ కేసును తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకే కోర్టు జోక్యం చేసుకుని కేసు దర్యాప్తు ను సీబీఐకి అప్పగించాలని కోరుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

అయితే వివేకా హత్యలో రాజకీయ ప్రముఖులు ఉన్నారని, ఇందులో ఐదుగురు బడా నేతల జోక్యం ఉందని వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు. సొంత కుటుంబసభ్యుడిని హత్య చేసి రాజకీయానికి వాడుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి ఆయన వైఖరిలో మార్పే నిదర్శనంగా నిలుస్తోందని వ్యాఖ్యనిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ముగ్గురు కీలకంగా ఉన్నారని.. అందుకే సీబీఐ కి ఈ కేసు అప్పగించడానికి అంగీకరించడం లేదని వెల్లడిస్తున్నారు.