Begin typing your search above and press return to search.

ఏబీది బ్లాక్ మెయిలింగేనా ?

By:  Tupaki Desk   |   17 April 2021 10:30 AM GMT
ఏబీది బ్లాక్ మెయిలింగేనా ?
X
ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంపై ఆయన తాజాగా సీబీఐకి రాసిన లేఖ వివాదాస్పదమైంది. వివేకా హత్యకు సంబంధించిన విషయాలు తన దగ్గరున్నాయని, ఇస్తానని చెప్పినా సీబీఐ తీసుకోవటం లేదంటు ఏబీ రచ్చ మొదలుపెట్టారు. సీబీఐకి రాసిన లేఖ మీడియాకి విడుదలచేశారు. గడచిన రెండు రోజులుగా ఇదే విషయమై ఏబీ పేరుతో గోల మొదలైంది.

సరిగ్గా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ కు ముందు వివేకా హత్య కేసుపై ఏబీ పేరుతో రచ్చ మొదలవ్వటం గమనార్హం. నిజానికి ఏబీకి వివేకాహత్య ఘటనకు ఇపుడు ఏమాత్రం సంబంధంలేదు. పైగా ఆయన సస్పెన్డయి ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద ఐపీఎస్ అధికారి. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను, వైసీపీని బాగా ఇబ్బందిపెట్టడంలో అత్యుత్సాహం చూపిన అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్నవ్యక్తి. ఆకాశమేహద్దుగా అప్పట్లో చెలరేగిపోయిన ఏబీపై సహజంగానే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ మొదలైంది.

ఇటువంటి నేపధ్యం కలిగిన వ్యక్తికి ఇపుడు వివేకానందరెడ్డి హత్యకేసుతో ఎలాంటి సంబంధంలేదు. వివేకా హత్య జరిగినపుడు ఆయన నిఘా విభాగం డీజీగా ఉంటే ఉండచ్చు. అంతేకానీ ఇపుడు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేనపుడు ఆయన మాట్లాడకూడదు. కానీ ఇపుడు ఆయన వ్యవహారశైలి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉందనిపిస్తోంది. తనను ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణ చేయిస్తున్న కారణంగా తాను కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలన్న ఉద్దేశ్యమే కనబడుతోంది. నిజంగానే ఏబీ దగ్గర ఏవైనా సాక్ష్యాలుంటే చంద్రబాబు హయాంలోనే పోలీసులకు అందించుండాలి.

పైగా వివేకా హత్యకు సంబంధించిన వ్యవహారాలపై తన దగ్గర సాక్ష్యాధారాలను అట్టిపెట్టుకోవటం కూడా ఏబీ తప్పంటున్నారు. ప్రభుత్వ సర్వీసు నుండి తప్పుకున్న అధికారి తన దగ్గర కీలకమైన సాక్ష్యాలను, సమాచారాన్ని అట్టేపెట్టుకోవటం తప్పే అని వైసీపీ నేతలంటున్నారు. ఏ రకంగా చూసినా ఏబీ వ్యవహారశైలి జగన్ను ఇరుకునపెట్టాలన్నట్లే కనబడుతోందని అనుమానంగా ఉంది. తన వ్యవహారశైలితో మరింత వివాదాస్పదమవటం తప్ప ఏబీ సాధించేదేమీ ఉండదని వైసీపీ నేతలంటున్నారు. మరి చూడాలి చివరకు ఏమవుతుందో.