Begin typing your search above and press return to search.

గ్యాస్ లీక్: నాడు భోపాల్.. నేడు విశాఖ.. అదే విషాదం

By:  Tupaki Desk   |   7 May 2020 9:50 AM GMT
గ్యాస్ లీక్: నాడు భోపాల్.. నేడు విశాఖ.. అదే విషాదం
X
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమ నుంచి గత అర్ధరాత్రి విడుదలైన స్టెరిన్ గ్యాస్ లీక్ కారణంగా 8 మంది చనిపోవడం.. 200 మంది సీరియస్ గా ఉండడం పెను విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని వార్తలొస్తున్నాయి. ఈ ఘటన 36 ఏళ్ల కిందట భోపాల్ లో జరిగిన గ్యాస్ ఘటనను గుర్తుకు తెస్తోంది. పెను విషాదాన్ని నింపిన ఆ ఘోరం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది.

గురువారం అందరూ ఉదయం నిద్రలేస్తున్న వేళ.. ఈ మాటలకందని విషాద వార్తను విన్నారు. అక్కడి పరిస్థితిపై ఇప్పటికే స్థానికులు తీసిన వీడియోలు భయానకంగా ఉన్నాయి. వైరల్ అయ్యాయి. నాటి భోపాల్ ఘటనను విశాఖ గ్యాస్ లీక్ గుర్తుకు తెస్తోందని మేధావులు అంటున్నారు.

1984 డిసెంబర్ 2న అర్ధరాత్రి భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి 40 టన్నుల విష వాయువులు వెలువడి మూడు రోజులపాటు తీవ్రత కొనసాగి ఏకంగా సుమారు 10వేల మంది ప్రాణాలను అదే రోజు పొట్టనపెట్టుకుంది. ప్రపంచంలోనే ఇప్పటివరకు జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇదే అత్యంత భయానకమైంది. ఓ చిన్నారి మరణించిన ఫొటో ప్రపంచాన్ని కంటతడి పెట్టించి వైరల్ అయ్యింది. మొత్తం ఈ దుర్భటనతో నేటి వరకు 25వేల మంది మరణించారని అంచనా.. 5 లక్షల మంది జీవితాలను ఈ ఘటన చిదిమేసింది. గర్భస్త శిశువులు కూడా ఈ వాయువు ధాటికి ప్రభావితమయ్యారు. శారీరక, మానసిక వికలాంగులుగా పుట్టారు. కి.మీల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. భోపాల్ నగరంలో 3వంతుల భూభాగం విషతుల్యమైంది.

ఈ ఘోరకలికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ అధినేత ప్రధాన నిందితుడు వారెన్ అండర్సన్ ను 1984 డిసెంబర్ లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే భారత్ కు తిరిగి వస్తానని చెప్పి దేశం దాటి పారిపోయాడు. అతడు తిరిగి రాలేదు. అమెరికా పంపలేదు. దీంతో 92 ఏళ్ల వయసులో మొన్ననే 2014లో చనిపోయాడు. ఈ కేసు అలానే ఉండిపోయింది.

ఈ కంపెనీపై అమెరికా న్యాయస్థానాల్లో పరిహారం కోసం భారత్ పోరాడిన పెద్దగా నష్టపరిహారం దక్కలేదు. ఒక్కొక్కరికి రూ.15వేలు చెల్లించారు. నిందితులకు శిక్ష పడలేదు.ఒక తరాన్ని కుదిపేసిన భోపాల్ దుర్ఘటనలో ఎలాగూ న్యాయం జరగలేదు.మరి విశాఖ గ్యాస్ లీక్ ఘటనలోనైనా బాధితులకు న్యాయం జరుగుతుందో వేచిచూద్దాం..