Begin typing your search above and press return to search.

విశాఖ గ్యాస్ లీక్ ... బాధితుల్లో బయటపడుతోన్న కొత్త సమస్యలు !

By:  Tupaki Desk   |   14 May 2020 10:30 AM GMT
విశాఖ గ్యాస్ లీక్ ... బాధితుల్లో బయటపడుతోన్న కొత్త సమస్యలు !
X
ఒకవైపు ఈ వైరస్ ఏపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో ఏపీతో పాటుగా యావత్ దేశ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది విశాఖ దుర్ఘటన. వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుంచి స్టెరైన్ విషవాయువు వెలువడటంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలప్రజలకు తీవ్ర దయనీయ స్థితి ఏర్పడింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. సుమారు 516 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే , మరోవైపు విష వాయువు స్టైరిన్ ప్రభావానికి లోనై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. బాధితుల చర్మంపై బొబ్బలు,చిన్నారుల్లో జ్వరం,న్యుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత చర్మంపై దురద,మంట రావడం.. ఆ తర్వాత చర్మం కమిలిపోయి బొబ్బలు వస్తున్నాయి. దీంతో చర్మ వ్యాధుల నిపుణులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. కొందరు బాధితులు కనీసం ఆహారం కూడా తీసుకోలేక పోతున్నారని తెలుస్తోంది.

దీనితో వీరి ఆరోగ్యంపై వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వేడి తీవ్రత కారణంగా 15-20 మందికి చర్మం కాలిపోగా.. మరికొందరు తలనొప్పి, కాళ్ళు లాగడం, ఛాతిలో నొప్పి, వికారం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం రూ. కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే, బాధితుల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వారికి కూడా పరిహారం ప్రకటించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది.