Begin typing your search above and press return to search.

స్వ‌చ్ఛ భార‌త్‌ లో మ‌న న‌గ‌రాలే టాప్

By:  Tupaki Desk   |   15 Feb 2016 1:43 PM GMT
స్వ‌చ్ఛ భార‌త్‌ లో మ‌న న‌గ‌రాలే టాప్
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాన‌స‌పుత్రిక‌ల్లో టాప్‌ లో నిలిచే స్వ‌చ్ఛ‌భార‌త్‌ లో ఆయ‌న‌కే చుక్కెదుర‌యింది. స్వచ్ఛ భార‌త్ ప‌థ‌కం ప‌నితీరు విష‌యంలో కేంద్రం స్వచ్ఛ పర్యవేక్షణ్ పేరుతో ఇచ్చిన ర్యాంక్‌ ల‌ల్లో మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. అదే స‌మ‌యంలో తెలుగు రాష్ర్టాల్లో కీల‌క న‌గ‌రాల‌యిన విశాఖ‌ప‌ట్ట‌ణం - వ‌రంగ‌ల్ స‌త్తాచాటాయి.

స్వ‌చ్ఛ భారత్ సాధన లక్ష్యంలో భాగంగా తొలి విడతలో 73 నగరాలు, పట్టణాలను ఎంపిక చేసి ఆ వివ‌రాల‌ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్ల‌డించారు. ఈ వివ‌రాల ప్ర‌కారం అన్నిటి కంటే అగ్రస్థానంలో మైసూరు నగరం నిలవ‌గా టాప్‌ టెన్ న‌గ‌రాల్లో విశాఖ నిలిచింది. మైసూరు - విశాఖలతో పాటు చండీగఢ్ - తిరుచాపల్లి - ఢిల్లీ - సూరత్ - ముంబై - రాజ్ కోట్ తదితర నగరాలున్నాయని వెంకయ్యనాయుడు వివరించారు. స్వచ్ఛత విషయంలో అట్టడుగు స్థానాలలో ఉన్న నగరాలలో పట్నా - ఇటీనగర్ - ధన్ బాద్‌ తదితర నగరాలున్నాయన్నారు. టాప్ 30 జాబితాలో హైదరాబాద్ - వరంగల్ నగరాలు ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణలో అట్టడుగు స్థాయి నగరాల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరం ఉండటం గమనార్హం. ఇలా ఉండగా గత ఏడాదితో పోలిస్తే కొన్ని నగరాల ర్యాంకులు మెరుగుపడ్డాయని చెప్పిన వెంకయ్యనాయుడు అలా మెరుగుపడిన నగరాల సంఖ్య 32 అని ఆయ‌న‌ వివరించారు.

ప్ర‌ధాన‌మంత్రి మాస‌న‌పుత్రిక వంటి కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌గ‌రంలోనే ప‌ట్టింపులేన‌ట్లుగా అమ‌లు చేయ‌డం స్థానిక పాల‌కులు, అధికారుల పాల‌న‌కు అద్దంప‌డుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.