Begin typing your search above and press return to search.

ఆర్కే బీచ్ ఇసుక నల్లగా మారిందేంటి? ఆందోళనలో విశాఖ వాసులు

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:35 AM GMT
ఆర్కే బీచ్ ఇసుక నల్లగా మారిందేంటి? ఆందోళనలో విశాఖ వాసులు
X
తెలుగు ప్రజలకు సుపరిచితం విశాఖపట్నం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించని భిన్నమైన కల్చర్ విశాఖలో కనిపిస్తుంటుంది. ఆ నగరం ప్రశాంతంగా ఉండటమే కాదు.. ఎప్పుడూ ఏదో వేడుక మూడ్ లో ఉన్నట్లుగా ఉంటుంది.

ఓపక్క సముద్రం.. మరోపక్క కొండలు.. చుట్టూ పచ్చదనం.. దానికి తోడు సాయంత్రం అయితే సముద్ర గాలులు.. మొత్తంగా రోటీన్ కు భిన్నమైన సిటీగా విశాఖ దర్శనమిస్తుంది. దీనికి తోడు నేవీ.. స్టీల్ ఫ్యాక్టరీలతో భిన్నమైన కల్చర్ అక్కడ దర్శనమిస్తుంటుంది.

అందుకే.. విశాఖకు వెళ్లిన వారు ఎవరైనా సరే.. ఆ సిటీ మత్తులో చిక్కుకుపోతారు. మళ్లీ మళ్లీ వెళ్లాలనుకుంటారు. అలాంటి విశాఖ అన్నంతనే అందరికి గుర్తుకు వచ్చేది ఆర్కే బీచ్. విశాఖపట్నంలో బోలెడన్ని బీచ్ లు ఉన్నా.. ఆర్కే బీచ్ నగరానికి మధ్యలో ఉండటంతో పాటు.. నగరానికి మరింత వన్నె తెచ్చేలా ఉంటుంది. ఆ బీచ్ ప్రత్యేకతల్లో మరొకటి.. బంగారు వర్ణంలో మెరిసే ఇసుక.

తాజాగా అలాంటి ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న ఇసుక మొత్తం నల్లగా మారిపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ లేనిది ఇలా ఎందుకు జరిగినట్లు? అంటూ విశాఖ వాసులుఆందోళన చెందుతున్నారు. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ కూడా ఆర్కే బీచ్ ఇసుక ఇలా నల్లగా మారింది లేదని.. ఇదే మొదటిసారిగా వాపోతున్నారు. ఎందుకిలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనిపై కొందరు నిపుణులను ప్రశ్నించినప్పుడు.. సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకురావటం వల్ల ఇలా జరుగుతుందన్నారు. లేదంటే ఇసుకలోని రజను ఎక్కువ శాతం సముద్రంలోని నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పారు.

ఏమైనా సదరు ఇసుక శాంపిల్ ను పరీక్షలు జరిపితే.. అసలు విషయం తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకు రావటం మామూలు విషయమే అయినా.. ఆర్కే బీచ్ విషయంలో అలా ఎందుకు జరగలేదు? అన్నది ప్రశ్న. ఎప్పుడూ లేనిది ఇప్పుడే జరగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.