Begin typing your search above and press return to search.

లాభాల్లోకి *ఉక్కు* ప‌క్కా... బ్యాలెన్స్ షీటే సాక్ష్యం!

By:  Tupaki Desk   |   31 March 2021 4:39 PM GMT
లాభాల్లోకి *ఉక్కు* ప‌క్కా... బ్యాలెన్స్ షీటే సాక్ష్యం!
X
విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేట్ ప‌రం కావ‌డం ఖాయ‌మే. అయితే ఏ కార‌ణంతో అయితే ఈ క‌ర్మాగారాన్ని ప్రైవేట్‌కు అమ్మేయాల‌ని కేంద్రం చూస్తుందో... ఆ కార‌ణం స‌హేతుక‌మైన‌దే కాదంటూ ఇప్పుడు ఓ ఆసక్తిక‌ర‌మైన అంశం వైర‌ల్ గా మారిపోయింది. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు ఆ సంస్థ కూడ‌గ‌ట్టుకున్న న‌ష్టాలే కార‌ణ‌మంటూ కేంద్రం చెబుతున్న విష‌యం తెలిసిందే క‌దా. అయితే ఆ న‌ష్టాల మాట ముమ్మాటికీ అబద్ద‌మేన‌ట‌. స‌మీప భ‌విష్య‌త్తులోనే విశాఖ ఉక్కు లాభాల్లోకి రావ‌డం ఖాయ‌మట‌. అంతేకాదండోయ్‌... న‌ష్టాల బాట నుంచి లాభాల బాట ప‌ట్ట‌డ‌మే కాకుండా... ఏకంగా ఈ రంగంలో విశాఖ ఉక్కు ఏకంగా నెంబ‌ర్ వ‌న్ స్థానానికి కూడా చెరుతుంద‌ట‌. ఈ మాట‌లు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్న పార్టీలో, ఆ సంస్థ కార్మికులో చెబుతుద‌న్న‌వి కావు. స్వ‌యంగా విశాఖ ఉక్కు యాజ‌మాన్య‌మే చెబుతున్న మాట‌. విశాఖ ఉక్కు ఇటీవ‌ల విడుద‌ల చేసిన బ్యాలెన్స్ షీట్ లో ఈ విష‌యాలు చాలా స్ప‌ష్టంగానే ఉన్నాయి.

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా కేంద్రం స్పీడు పెంచేసిన త‌రుణంలో ఈ విష‌యం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న విష‌యం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంద‌ని చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సమాచార హక్కు కార్యకర్త రమేష్ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు విశాఖ ఉక్కు యాజ‌మాన్యం త‌న బ్యాలెన్స్ షీట్ ను బ‌య‌ట‌పెట్ట‌క త‌ప్ప‌లేదు. ఈ నివేదిక‌లో సంస్థ కార్మికులు గానీ, కేంద్ర ప్ర‌భుత్వం గానీ, స్థానిక ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని చాలా నిజాలు ఉన్నాయి. అంటే త్వ‌ర‌లోనే లాభాల బాట‌లోకి రావ‌డ‌మే కాకుండా ఉక్కు రంగంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచే స‌త్తా క‌లిగిన విశాఖ ఉక్కును కేంద్రం త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోస‌మో, త‌న మొండి వైఖ‌రితోనే అమ్మేయాల‌ని చూస్తున్న‌ట్టే క‌దా. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఆర్టీఐ కార్య‌క‌ర్త‌కు అందిన విశాఖ ఉక్కు బ్యాలెన్స్ షీట్ లో అస‌లు ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే... విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తులో కచ్చితంగా లాభాల బాటను పట్టేందుకు నూటికి నూరు శాతం అవకాశాలు ఉన్నాయని ఈ బ్యాలెన్స్ షీట్ తేల్చేసింది. అంతేకాకుండా విశాఖ‌ ఉక్కు త్వరలోనే లాభాలను గడించి ఈ రంగంలో నంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్తుందని కూడా ఈ బ్యాలన్స్ షీట్ గట్టిగానే చెబుతోంది. ఇలా స్వ‌యంగా విశాఖ ఉక్కు ప‌రిస్థితిపై సొంతంగా యాజ‌మాన్య‌మే ఈ త‌ర‌హా అభిప్రాయంతో ఉంటే... ఆ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడుతున్న న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఈ సంస్థ‌ను ఎందుకు ప్రైవేట్ ప‌రం చేయ‌నుంద‌న్న అంశం స‌మాధానం లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.