Begin typing your search above and press return to search.

ఇక్కడ డ్రోన్లు తయారవుతాయి.. కానీ ఎగరవ్?

By:  Tupaki Desk   |   24 July 2017 5:41 AM GMT
ఇక్కడ డ్రోన్లు తయారవుతాయి.. కానీ ఎగరవ్?
X
యావత్తు ప్రపంచానికి డ్రోన్లు అందించే కేంద్రబిందువుగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దుతారట. చైనాకంటె అతితక్కువ ధరలకు విశాఖలో డ్రోన్ లను తయారు చేసేస్తారట. ఈ మేరకు కార్నిజి మెలాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజిరెడ్డి తో పాజిబిలిటీస్ చర్చించడానికి రాష్ట్రమంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఇది తొలి భేటీనే. అయితే అప్పుడే.. డ్రోన్ల నగరం తయారైపోయిన స్థాయిలో భవిష్యత్తు గురించి ఆయన అరచేతిలో డ్రోన్ ప్రపంచాన్ని చూపించేస్తున్నారు.

ఆయన ఊహాలు బాగానే ఉండొచ్చు. కానీ కామెడీ ఏంటంటే.. విశాఖను డ్రోన్ల కేంద్రంగా తయారుచేయవచ్చు గాక.. కానీ.. ఏపీలో డ్రోన్లు మాత్రం ఎగరవు. ప్రెవేటు వ్యక్తులు డ్రోన్ లను వినియోగించడానికి సంబంధించి రాష్ట్రంలో చాలా కఠినమైన ఆంక్షలున్నాయి. డ్రోన్ వినియోగించి మీరు ఫోటో తీసుకోవాలనుకున్నా సరే.. విధిగా దానికి పోలీసు అనుమతులు అవసరం. అనుమతులు లేకుండా డ్రోన్ లను వినియోగిస్తే మీమీద కేసులు నమోదు చేసి జైలు పాల్జేయడానికి అవకాశం ఉంది. అంటే.. డ్రోన్ల వినియోగంలో రాష్ట్రంలో ఉన్న అర్థంలేని భయాలను, అర్థంలేని నిబంధనలను సడలించే ఆలోచన లేకుండానే.. చినబాబు గారు.. తన మాటల చాతుర్యం ప్రదర్శించి.. రాష్ట్రాన్ని డ్రోన్ల కేంద్రంగా తీర్చిదిద్దేస్తాం అని సెలవిస్తున్నారు.

ఇక్కడ మరో సంగతిని కూడా గుర్తించాలి. ఇప్పటిదాకా ఏపీలో మన దృష్టికి వస్తున్నదాన్ని బట్టి ప్రభుత్వ కార్యకలాపాల్లో అనగా.. పోలవరం పనులను చంద్రబాబు సమీక్షించే సమయంలోను, మరికొన్ని ఇలాంటి సందర్భాల్లోను మాత్రమే డ్రోన్ల వాడకం గురించి వినిపిస్తోంది. అయితే ఇవి పుష్కలంగా అందుబాటులో ఉంటే వ్యవసాయం - ఎర్రచందనం అక్రమరవాణా - సిమెంటు - సహజవాయు రంగాల్లో కూడా వాటి వాడకం పెరుగుతుందని లోకేష్ బాబు అంటున్నారు. ఆయన చెప్పే ప్రకారం.. రివర్సులో పోలీసుల ఉనికి తెలుసుకోవడానికి ఎర్రచందనం దొంగలు కూడా వాటిని వాడుకోగలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటిదాకా జనానికి వీటిని అందుబాటులోకి తెస్తారా.. లేదా ప్రభుత్వ రంగాలకు మాత్రమే పరిమితం చేస్తారా అనేది సామాన్యులకు కలిగే సందేహం. అందుకే విశాఖ డ్రోన్ల తయారీ కేంద్రంగా ఎదగవచ్చు గాకీ.. కానీ, ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రం డ్రోన్లు ఎగిరే స్వేచ్ఛా ప్రాంతంగా మాత్రం ఉండకపోవచ్చునని అనుకుంటున్నారు.