Begin typing your search above and press return to search.

అప్పటి కేసు చిన్నమ్మను వదలట్లేదే..

By:  Tupaki Desk   |   3 Feb 2017 6:43 AM GMT
అప్పటి కేసు చిన్నమ్మను వదలట్లేదే..
X
చేసిన పాపం ఊరికే పోదంటారు. చేతిలో అధికారం పుష్కలంగా ఉన్నా.. కొన్నిసార్లు అవేమీ అక్కరకు రావు. తాజాగా తమిళనాడు చిన్నమ్మ శశికళ పరిస్థితి కూడా ఇదే రీతిలో ఉంది. పాలక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమెను పాత కేసులు వెంటాడి వేధిస్తున్నాయి. అప్పుడెప్పుడో విదేశీమారక ద్రవ్యం మోసం కేసులో ఇరుక్కున్న చిన్నమ్మ.. ఇప్పుడా కేసుల నుంచి విముక్తి చేయాలన్న వాదనను వినకపోవటం సరికదా.. గతంలో ఇచ్చిన తీర్పును ముదురై హైకోర్టు రద్దుచేయటం ఇప్పుడామెను ఇబ్బందులకు గురి చేసేలా మారింది.

ఇంతకీ చిన్నమ్మ మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? ఆమెను వెంటాడి వేధిస్తున్న కేసుల ముచ్చటేందన్న విషయాన్ని చూస్తే.. సుమారు ఇరవై ఏళ్ల కింద శశికళ వాటాదారుగా ఉన్న భరణి బీచ్ రిసార్ట్స్ సంస్థకు ఎన్ ఆర్ ఐ సుశీలా రామస్వామి అనే వ్యక్తి నుంచి రూ.3కోట్లు పరోక్షంగా అప్పు అందింది. ఈ మొత్తంలో రూ.2.2 కోట్లను కొడనాడు ఎస్టేట్స్ లో వాటాగా పెట్టుబడి పెట్టారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని తరలించినట్లుగా పేర్కొంటూ శశికళ.. దినకరన్.. జేజే టీవీ తదితరులపై 1996లో ఈడీకి ఒక ఫిర్యాదు అందింది. దీనిపై కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు నుంచి తనను తప్పించాల్సిందిగా అప్పట్లో చిన్నమ్మ కాని శశికళ కోర్టును కోరారు.

దీనిపై విచారించిన చెన్నై ఆర్థిక నేరాల న్యాయస్థానం శశికళపై ఉన్న మూడు కేసులకు ఒక దాని నుంచి తప్పించేందుకు ఓకే చెప్పేసింది. మరో రెండు కేసుల నుంచి దినకర్ ను విముక్తి చేసింది. తనపై ఉన్న కేసులపై రియాక్ట్ అయిన శశికళ.. మద్రాస్ హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. దీనిపై వాద ప్రతివాదనలు సుదీర్ఘంగా సాగాయి. తాజాగా మధురై హైకోర్టులో న్యాయమూర్తి చొక్కలింగం తీర్పునిస్తూ.. ఈ వ్యవహారంలో తనకు బాధ్యత లేదంటూ శశికళ చేసిన వాదనను తోసిపుచ్చుతూ.. ఆమె చట్టపరమైన చర్యల్ని ఎదుర్కొనక తప్పదన్న విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో.. ఎప్పుడో జరిగిన కేసు ఇప్పుడు ప్రెష్ గా మీద పడటం చిన్నమ్మకు చిరాకు తెప్పించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/