Begin typing your search above and press return to search.

ఇంకో కేంద్ర‌మంత్రికి కేటీఆర్ న‌చ్చేశాడు

By:  Tupaki Desk   |   7 May 2018 6:59 AM GMT
ఇంకో కేంద్ర‌మంత్రికి కేటీఆర్ న‌చ్చేశాడు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ వ్యూహాత్మ‌కంగా `ముఖ్య‌`మైన స్థానానికి చేరువ అవుతున్నారా? వివిధ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న్ను ప్రొజెక్ట్ చేసే విధానంతో పాటుగా ఢిల్లీ పెద్ద‌ల‌కు ఆయ‌న ద‌గ్గ‌ర‌వుతున్న తీరు వెనుక మ‌ర్మం ఇదేనా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా మ‌రో కేంద్ర‌మంత్రి కేటీఆర్‌పై పొగ‌డ్త‌లు కురిపించిన నేప‌థ్యంలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో నిర్వహించిన దక్కన్ డైలాగ్ మొదటి సదస్సుకు కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌మంత్రి జనరల్ వీకే సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేటీఆర్‌ పై ప్ర‌శంస‌లు కురిపించారు. `కేటీఆర్ కేవలం తన శాఖలకు మాత్రమే పరిమితమయ్యే వ్యక్తి కాదు. ఆయనలో ఒక డైనమిజం కనిపిస్తుంది. తన విభాగంతోపాటుగా మిగతా శాఖలపై సైతం ఆయన పట్టు సాధించారు` అని అభినందించారు.

ఇక తెలంగాణ‌కు సైతం జ‌న‌ర‌ల్ సింగ్ కితాబివ్వ‌డం గ‌మ‌నార్హం. `తెలంగాణ రాష్ట్రం పలు విప్లవాత్మక నిర్ణయాలతో ఈవోడీబీలో స్వల్పకాలంలో నంబర్ వన్ స్థానానికి చేరడం సంతోషకరం. తెలంగాణ అభివృద్ధిపథంలో ఒక మెట్టు ఎక్కితే అది మిగతా రాష్ర్టాలకు స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి విధానం ప్రామాణికం అయితే అది కొనసాగుతుంది. పరిశోధనలు - అభివృద్ధి - ఆవిష్కరణలు - ఐటీ - పరిశ్రమల రంగంలో తెలంగాణ మరింతగా ఎదుగాలని ఆకాంక్షిస్తున్నా` అని అన్నారు. హైదరాబాద్‌ను ఈ చర్చాగోష్ఠికి ఎంపిక చేయడానికి పలు అంశాలు కారణమయ్యాయి. హైదరాబాద్ అద్భుతమైన సంస్కృతి, పరిపాలన, అభివృద్ధి.. ఇలా అన్ని రంగాల్లో ఉన్నతస్థానంలో ఉంది. ఇక్కడి పాలన, రాజకీయ వాతావరణం సుస్థిరంగా ఉన్నాయి. భౌగోళికపరంగా హైదరాబాద్ మిగతా ప్రాంతాల కంటే ఒక మెట్టు పైనే ఉంది. 1970లో నేను హైదరాబాద్‌లో ఉన్నా. అప్పట్నుంచి ఇప్పటివరకు గమనిస్తున్నా. హైదరాబాద్ ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సహా ఇతర రంగాలకు హబ్‌గా ఎదిగింది. ఇంకా ఎదుగాలని ఆకాంక్షిస్తున్నా అని కేంద్రమంత్రి అన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ త‌న తండ్రి ఇటీవ‌లి కాలంలో జ‌పిస్తున్న ఢిల్లీ పెత్త‌నం ఏంటి అనే మాట‌ను వినిపించ‌డం విశేషం. `అన్నింటికీ ఢిల్లీ నిర్ణయాధికారిగా ఉండి.. మేం నిర్ణయిస్తాం.. మీరు పాటించండి అనడం సరికాదు. కేంద్రం సమన్వయంచేయడం సరైనదే. కానీ కొన్ని విషయాల్లో రాష్ర్టాలకు అధికారాలు ఇవ్వాలి` అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రపంచబ్యాంక్ నివేదికల ఆధారంగానో, కన్సల్టెన్సీ సంస్థ అభిప్రాయం కోణంలోనో దేశమంతటినీ ఒకే గాటన కట్టి చూడవద్దని.. ఆయా రాష్ర్టాల్లో ఉన్న పరిస్థితులను బట్టి చూడాలని తెలిపారు. `సులభ వాణిజ్యంలో ప్రపంచంలో భారత్ ర్యాంకింగ్ దాదాపు 100 దగ్గర ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడం ద్వారా స్వల్పకాలంలోనే ఈవోడీబీలో దేశంలోనే ప్రథమ స్థానానికి చేరాం. తద్వారా ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించాం. మరింత ఎదిగేందుకు కేంద్రం ద్వారా అనుమతులపరంగా పలు అంశాలు ఇబ్బందిగా ఉంటున్నాయి. అందుకే ప్రపంచంలోని వివిధ దేశాలతో ఆయా రాష్ర్టాలు నేరుగా చర్చించుకునే అవకాశం ఇవ్వాలి. ఒప్పందాలు చేసుకునేందుకు అనుమతులివ్వాలి. దీనివల్ల ఆ రాష్ట్రం ఎదిగేందుకు అవకాశం దొరుకుతుంది. రాష్ట్రం ఏదైనా అభివృద్ధిలో ముందుకు సాగితే.. అది సహజంగానే దేశం పురోగామి దిశగా నడిచేందుకు కారణంగా మారుతుంది` అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. కాగా, సాక్షాత్తు కేంద్ర‌మంత్రి ప్ర‌శంసల‌తో టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఖుష్ అవుతున్నాయి.