Begin typing your search above and press return to search.

క్రిమియా వంతెనను సందర్శించి పుతిన్.. అమెరికాకు ఝలక్..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 8:30 AM GMT
క్రిమియా వంతెనను సందర్శించి పుతిన్.. అమెరికాకు ఝలక్..!
X
ఉక్రెయిన్-రష్యా మధ్య గడిచిన తొమ్మిది నెలలు యుద్ధం కొనసాగుతోంది. ఒకట్రోండు రోజుల్లో ముగిసిపోతుందని అంతా భావించగా అందరినీ అంచనాలను తలకిందులు చేస్తూ వార్ నేటికీ కొనసాగుతోంది. రష్యాకు ధీటుగా ఉక్రెయిన్ సైన్యం జవాబు చెబుతుండటంతో ఇప్పట్లో యుద్ధం ముగిసే అవకాశం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అయితే ఈ యుద్ధం జరుగుతుండగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యం బారిన పడ్డారని.. అతడిపై విషప్రయోగం జరిగిందనే వార్తలు వచ్చాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సైతం పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని అందులో అజ్ఞాతంలోకి వెళ్లాడని వెల్లడించడంతో ఈ వార్త నిజమేనని అంతా భావించారు. అయితే దీనిని రష్యన్ మీడియా ఖండించింది.

త్వరలోనే రష్యా కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని అమెరికా ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటికి వచ్చారు. పలు అధికారిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. ఇటీవల క్యూబా అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్ కానెల్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

క్యూబా అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్ కానెల్ తో పుతిన్ కరచాలనం ఇచ్చిన ఫోటోపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడిచింది. పుతిన్ చేతులు పర్పుల్ రంగులోకి మారడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఆరోగ్య పరిస్థితి మరోసారి చర్చకు దారితీసింది. అయితే రెండ్రోజులు క్రితం మాస్కోలోని పుతిన్ అధికార నివాసంలో ఆయన మెట్లు దిగుతూ కింద పడిపోయారని.. దీంతో తుంటి ఎముక విరిగింది అంటూ న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది. తుంటి ఎముక దెబ్బతినడంతో అతడి ప్రమేయం లేకుండా మలమూత్ర విసర్జన జరుగుతోందంటూ రాసుకొచ్చింది.

ఈ నేపథ్యంలోనే రష్యా టెలివిజన్లో పుతిన్ క్రిమియా వంతెనను సందర్శించిన దృశ్యాలను ప్రసారం చేసింది. ఇటీవల బాంబు దాడిలో క్రిమియా వంతెన పాక్షికంగా దెబ్బతినగా పుతిన్ ఆ ప్రాంతాన్ని తాజాగా సందర్శించారు.  ''వంతెన ఎడమవైపు దాడి జరిగింది.. ఇది పని చేసే స్థితిలో నే ఉందని అనుకుంటున్నా.. అయినా పనులు చేయాల్సి ఉంటుందని.. దీనిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావాలి'' అంటూ పుతిన్ వ్యాఖ్యానించారు.

ఈ వీడియోలో పుతిన్ స్వయంగా తన మెర్సిడెస్ బెంజ్ కారును డ్రైవింగ్ చేస్తూ క్రిమియా వంతెనపై ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన పక్కన డిప్యూటీ ప్రధాని ఖుసులిన్ ఉన్నారు. వీరిద్దరు వంతెన పరిస్థితిపై చర్చించుకున్నారు. పుతిన్ తాజా వీడియోతో ఆయనపై అమెరికా చేస్తున్న ప్రచారం ఏమాత్రం నిజం లేదని తేటతెల్లమైంది. రష్యా మీడియా విడుదల చేసిన ఈ తాజా వీడియో అమెరికాకు ఝలక్ ఇచ్చినట్లే కన్పిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.