Begin typing your search above and press return to search.

అమెరికా గుండెల్లో బాంబు పేల్చిన రష్యా

By:  Tupaki Desk   |   1 March 2018 5:26 PM GMT
అమెరికా గుండెల్లో బాంబు పేల్చిన రష్యా
X
అమెరికా రష్యాల మధ్య అన్ని రకాలుగా ఏర్పడిన పోటీ ప్రపంచాన్ని చాలాకాలం పాటు ప్రచ్ఛన్నయుద్ధం గడపన బతికేలా చేసింది. రష్యా బలహీన పడిన తరువాత అమెరికా సూపర్ పవర్ అయిపోయింది. అయితే... పుతిన్ రాకతో మళ్లీ రష్యా ఆర్థికంగా - రాజకీయంగా స్థిరత్వం సాధించింది. దీంతో మళ్లీ రష్యా అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసిరేలా తయారైంది. కొన్నాళ్లుగా ఇది తెలుస్తూనే ఉంది. అమెరికా కూడా రష్యాను చూసి మునుపటి కంటే ఎక్కువగా భయపడుతోంది. ఆ భయాన్ని మరింత పెంచేలా రష్యాఅధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా మొత్తాన్నీ అల్లకల్లోలం చేయగలిగేటంత శక్తిమంతమైన సరికొత్త అణ్వాయుధాలను తయారుచేసినట్లు ఆయన ప్రకటించారు.

తాను రూపొందించిన కొత్త తరహా అణ్వాయుధాలకు ఎదురే లేదని రష్యా చెబుతోంది. వాటిని ప్రయోగిస్తే.. అగ్రరాజ్యం అమెరికా కూడా ముక్కలవ్వాల్సిందేనంటోంది. గురువారం మాస్కోలో ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ రష్యా తయారుచేసిన కొత్తతరం అణ్వాయుధాలను గురించి ప్రకటించారు.

వీటిలో ఒకటి అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్రూయిజ్ మిస్సైల్ కాగా మరొకటి సముద్రగర్భంలో ప్రయాణించగల అణ్వాయుధ సామర్థ్యం గల డ్రోన్. ఇప్పటికే ఈ క్రూయిజ్ మిస్సైల్‌ ను రష్యా పరీక్షించినట్లు పుతిన్ చెప్పారు. రష్యా రూపొందించిన ఈ మిస్సైల్ ఎటువంటి భద్రతా కవచాన్నైనా ఛేదించుకుని వెళ్లి లక్ష్యాన్ని తాకగలదని ఆయన పేర్కొన్నారు. ఇక నీటిలో ప్రయాణించే డ్రోన్ కూడా అత్యంత వేగంగా అణ్వాయుధాలను మోసుకెళ్లి సముద్రంలోని శత్రుదేశాల విమాన వాహక నౌకలను భస్మీపటలం చేయగలదని తెలిపారు. రష్యా ఇప్పటికే ఓ అత్యాధునిక మహా ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. దీనిపేరు ‘ఆర్ ఎస్-28 సర్మత్'. 100 టన్నుల బరువుండే ఈ మహా ఖండాంతర క్షిపణి 10 పెద్ద, లేదంటే 16 చిన్న అణుబాబులను ఒకేసారి మోసుకెళ్లగలదు. ఈ భారీ క్షిపణిని ఒకసారి ప్రయోగిస్తే సువిశాల భూభాగాన్ని మరుభూమిగా మార్చివేయగలదు. ఇప్పటికే రష్యా వద్ద ఉన్న ‘ఎస్‌ఎస్-18 శాటన్' క్షిపణుల స్థానంలో ఈ మహా క్షిపణులతో భర్తీ చేయాలనేది అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలోచన. ఈ సర్మత్ క్షిపణులు దేశాలకు దేశాలనే బూడిద కుప్పలుగా మార్చగలవు. రష్యా మకాయెవ్ రాకెట్ డిజైన్ బ్యూరోలో ఈ సర్మత్‌ మహా క్షిపణులను రూపొందించింది.