Begin typing your search above and press return to search.

ట్రంప్ గెలుపు వెనుక పుతిన్ హ్యాకింగ్?

By:  Tupaki Desk   |   15 Dec 2016 6:45 AM GMT
ట్రంప్ గెలుపు వెనుక పుతిన్ హ్యాకింగ్?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల మీద రేగుతున్న సందేహాలకు మరింత బలం చేకూరేలా సంచలన కథనం ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించటం తెలిసిందే. అయితే.. ఇదంతా మీడియా అత్యుత్సాహమే తప్పించి.. అమెరికన్ల మనసుల్ని అర్థం చేసుకోవటంలో అక్కడి మీడియా చేసిన తప్పులే.. హిల్లరీ విజయం పక్కా అనేలా చేశాయన్న వాదన వినిపించింది. హిల్లరీ ఓటమి ప్రపంచానికే కాదు.. అమెరికన్లను సైతం పెద్ద ఎత్తున షాక్ కు గురి చేసిందన్న మాట వినిపించింది.

ఇదే సమయంలో.. ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేలా సాంకేతి వ్యవస్థలో చోటు చేసుకున్న తప్పిదాలతోనే ట్రంప్ గెలిచారన్న వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్ మీడియా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. యూఎస్ ఎలక్టోరల్ సిస్టమ్ ను హ్యాక్ చేసి ట్రంప్ గెలిచేందుకు రష్యా చేసిన ప్రయత్నంతోనే..తాజా ఫలితం వచ్చిందంటూ పేర్కొంది.

ఈ కథనంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించటమే కాదు.. ఈ కథనానికి సంబంధించిన పూర్తి సమాచార నివేదికను జనవరి 20 లోపు అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్ బీసీ న్యూస్ మీడియా సంస్థ తాజాగా మరో సంచలన కథనాన్ని తెర పైకి తీసుకొచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించేందుకు వీలుగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ వ్యక్తిగత సహకరాం ఉన్నట్లుగా పేర్కొంది.

ఈ సంచలన కథనం ప్రకారం.. హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారానికి సంబందించిన సమాచారాన్ని ఎలా హ్యాక్ చేయాలన్న అంశంపై పుతిన్ సలహాలు ఇచ్చినట్లుగా వెల్లడించింది. 2011లో జరిగిన రష్యా ఎన్నికల్లో యూఎస్ స్టేట్ సెక్రటరీగా ఉన్న హిల్లరీ.. పుతిన్ కు వ్యతిరేకంగా రష్యన్లను వీధుల్లో ఆందోళనలు చేసేందుకు ప్రోత్సహించారని.. ఆ విషయం తెలుసుకున్న పుతిన్.. ఆమెను వదిలిపెట్టేదే లేదని శపధం చేసినట్లుగా చెబుతారు.ఈ ద్వేషంలో భాగంగానే.. ఈ మధ్యన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు. మరోవైపు పుతిన్ హ్యాకింగ్ చేసి.. తన గెలుపునకు సాయం చేసినట్లుగా వస్తున్న వార్తలపై ట్రంప్ తీవ్రంగా ఖండిస్తున్నారు. మొత్తంగా ఒకరి తర్వాత ఒకరు.. ట్రంప్ విజయం వెనుక పుతిన్ హస్తం ఉందంటూ తెరమీదకు తీసుకొస్తున్న వాదనల జోరు పెరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/