Begin typing your search above and press return to search.

వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తి.. 400 ఏళ్ల నాటి పద్ధతిలో టపాసులు

By:  Tupaki Desk   |   2 Nov 2021 11:30 PM GMT
వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తి.. 400 ఏళ్ల నాటి పద్ధతిలో టపాసులు
X
దీపావళి పండుగ అనగానే పిల్లలకు, పెద్దలకు టపాసులే గుర్తుకువస్తాయి. ఉదయం వేళ భక్తిశ్రద్ధలతో పూజలు చేసినవారంతా సాయంత్రం ఇంటి ముంగిట్లో బాణాసంచాలు కాలుస్తూ సందడి చేస్తారు. అయితే వీటివల్ల కొన్ని అనర్థాలు లేకపోలేదు. పైగా ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. హోరెత్తే శబ్ధాలు వచ్చే క్రాకర్స్ ను పల్లెలు, నగరాల్లో కాలుస్తారు. ఫలితంగా పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. అందుకే దీపావళి కోసం ప్రత్యేకమైన టపాసులు తయారు చేసింది ఓ స్వచ్ఛంద సంస్థ. పిల్లలకు ఏమాత్రం హాని తలపెట్టని వందశాతం దేశవాళీ బాణాసంచాను రూపొందించింది. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో 400 ఏళ్ల నాటి పద్ధతిలో తయారు చేసింది గుజరాత్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ.

దీపావళి నాడు కాల్చే బాణాసంచాల వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఉన్న నేపథ్యంలో దేశవాళీ టపాసులు తయారు చేసింది వడోదరాకు చెందిన ప్రముఖ్ పరివార్ స్వచ్ఛంద సంస్థ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపును ఆదర్శంగా తీసుకున్న ఆ సంస్థ ఈ పర్యావరణహితమైన టపాకాయలను రూపొందించింది. బంకమట్టితో వీటిని రూపొందించారు. దాదాపు 400 ఏళ్ల నాటి పద్దతిలో దేశవాళీ క్రాకర్స్ ను తయారు చేశారు. వీటితో అటు పర్యావరణానికి కానీ ఇటు మనుషులకు కానీ ఎటువంటి హానీ ఉండదని ఆ స్వచ్ఛంద సంస్థ నితల్ గాంధీ వెల్లడించారు. ఇవి వంద శాతం దేశవాళీ టపాసులని ఆయన పేర్కొన్నారు. వీటిని బంకమన్ను... మరికొన్నింటిని కాగితం, వెదురు పదార్థాలతో తయారు చేసినట్లు వివరించారు. ఈ టపాసులను కోథిలుగా పిలుస్తారని చెప్పారు.

ప్రధాని వోకల్ ఫర్ లోకల్ పిలుపుతో ఈ స్వదేశీ క్రాకర్స్ ను తయారుచేస్తున్నామని నితల్ గాంధీ వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా స్థానిక ప్రజలకు కూడా ఉపాధి లభిస్తోందని ఆయన తెలిపారు. 400 క్రిత తయారు చేసిన పద్ధతుల్లో వీటిని రూపొందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇకపోతే గిరాకీ లేక పని వదిలేసిన తమకు... ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉపాధి లభిస్తోందని స్థానికులు తెలిపారు. ప్రముఖ్ పరివార్ సంస్థ చొరవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత మార్కెట్ లో మిరుమిట్లు గొలిపే టపాసులు అందుబాటులోకి వచ్చాయి. వింత వింత శబ్దాలతో హోరెత్తే క్రాకర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి కొత్త కొత్త బాణాసంచాలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే దేశవాళీ టపాసులకు డిమాండ్ కరవైంది. ఇలాంటి సమయంలో వచ్చిన మట్టి క్రాకర్స్ కు స్థానికంగా మంచి స్పందన వస్తోంది. 400 ఏళ్ల నాటి పద్ధతిలో తయారు చేసిన క్రాకర్స్ ను కొనడానికి స్థానికులు తరలివస్తున్నారని ప్రముఖ్ పరివార్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏది ఏమైనా అధిక డబ్బులు వెచ్చించి... పర్యావరణానికి హాని చేసే క్రాకర్స్ కన్నా... వందశాతం పర్యావరణ హితమైన దేశవాళీ బాణాసంచాలను వాడడం మంచిదని పర్యావరణ వేత్తలు కొందరు చెబుతున్నారు.