Begin typing your search above and press return to search.

ద‌క్షిణాదిలో బీజేపీ అదృష్టాన్ని తేల్చేది ఆ కుల‌మే

By:  Tupaki Desk   |   14 May 2018 4:28 AM GMT
ద‌క్షిణాదిలో బీజేపీ అదృష్టాన్ని తేల్చేది ఆ కుల‌మే
X
ద‌క్షిణాదిలో అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్న భార‌తీయ జ‌న‌తాపార్టీకి క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఎంతో ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ప్ర‌చారం అనంత‌రం పోలింగ్ ముగిసి కౌంటింగ్‌కు ఒక్క‌రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ...ఆయా పార్టీల గురించి రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ‌లు ఆగ‌డం లేదు. తాజాగా బీజేపీ సౌత్ డ్రీమ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే కీలక వర్గాలు ఎటువైపు మొగ్గుతారనే అంశంపై ఊహాగానాలు - అంచనాలు వెలుగులోకి వ‌చ్చాయి. వక్కలిగలు బలమైన సామాజిక వర్గంగా ఉన్న పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ ఏ మేరకు రాణిస్తుందనే అంశంపై బీజేపీ అదృష్టం ఆధారపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో తాము బ‌ల‌ప‌డ‌టం కంటే కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డేలా ఈ వ‌ర్గం ఓట్లు ప‌డితే బాగుంటుంద‌ని బీజేపీ నాయ‌కులు ఆశిస్తున్న‌ట్లు వివ‌రిస్తున్నారు.

క‌న్న‌డ రాష్ట్రంలో ముంబై-కర్ణాటక - హైదరాబాద్-కర్ణాటక - సెంట్రల్ కర్ణాటక - బెంగళూరు - తీరప్రాంత కర్ణాటక - పాత మైసూరు (దక్షిణ కర్ణాటక) అనే ఆరు కీలక ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశం అంతగా ప్రభావం చూపని కర్ణాటక ఎన్నికల్లో సహజంగానే కుల - ప్రాంతీయ సమీకరణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే వ‌క్క‌లిగ‌లు అధికంగా ఉన్న పాత‌మైసూర్‌ పై అంద‌రి చూపు ప‌డింది. ఒక్క పాత మైసూర్ ప్రాంతంలో తప్ప బీజేపీ అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కు పోటాపోటీగా నిలుస్తున్నది. పాత మైసూర్ ప్రాంతంలో మాత్రం జేడీఎస్‌ కు కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ ను బీజేపీ ఏమీచేయలేని దరిమిళా.. వక్కలిగ ఓట్లు గంపగుత్తగా జేడీఎస్‌ కు పడాలని కమలదళం కోరుకుంటోంది. మిగతా ప్రాంతాల్లో ఎలాగూ తమదే పైచేయి కాబట్టి రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్‌ను తొక్కేస్తామని కాషాయ వ్యూహకర్తలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరోలా ఉన్నాయి. పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్‌ కే మొగ్గు ఉన్నదని.. ఈ ప్రాంతంలో ఆ పార్టీకి అందరికన్నా ఎక్కువగా 36 శాతం ఓట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. బీజేపీ 22 శాతం - జేడీఎస్‌ కు 34 శాతం ఓట్లు పడుతాయని అంచనా వేసింది.

అయితే పాత మైసూర్ ప్రాంతంలో ఉన్న వక్కలిగ ఓట్ల ఏకీకరణను ముఖ్యమంత్రి సిద్దరామయ్య అహిందా వ్యూహం (మైనారిటీలు - దళిత - గిరిజన ఓట్ల ఏకీకరణ) అడ్డుకట్ట వేయగలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఐఎన్‌ ఎక్స్-సీఎన్‌ ఎక్స్ అంచనా మరోలా ఉన్నది. పాత మైసూరు ప్రాంతంలో 24-29 సీట్ల వరకు సాధించి జేడీఎస్ కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీస్తుందని.. తద్వారా రాష్ట్రస్థాయిలో బీజేపీ లబ్ధిపొందుతుందని ఈ సర్వే అంచనా వేసింది. దీంతో ``బీజేపీ సౌత్ డ్రీమ్`` నెర‌వేర‌డం ఇప్పుడు వ‌క్క‌లిగ కుల‌స్తుల చేతుల్లో ఉందంటున్నారు.