Begin typing your search above and press return to search.

ఇండోనేషియాలో సునామీ.. 70మంది మృతి

By:  Tupaki Desk   |   23 Dec 2018 6:20 AM GMT
ఇండోనేషియాలో సునామీ.. 70మంది మృతి
X
భూమధ్యరేఖ పై సముద్రంలో ఉండే ఇండోనేషియా దేశాన్ని మరోసారి సునామీ వణికించింది. 2005లో వచ్చిన సునామీ ధాటికి ఇండోనేషియా సహా భారత్ తూర్పు ఆగ్నేయ దేశాలన్నింటిలోనూ పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. శనివారం రాత్రి కూడా 9.30 గంటల తర్వాత ఇండోనేషియాలోని పండేగ్లాంగ్ - సెరాంగ్ - దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ పోటెత్తింది.

అగ్నిపర్వతం బద్దలవడంతోనే సముద్రంలో సునామీ వచ్చినట్టు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ గుర్తించింది.. క్రాకటోవ్ దీవిలోని అగ్నిపర్వతం బద్దలవడంతో అందులోంచి వెలువడ్డ లావా, బూడిద 500 మీటర్ల ఎత్తువరకూ ఎగిసిపడిందని.. ఈ అగ్ని పర్వతం పేలడం వల్లే సునామీ వచ్చి ఉంటుందని అధికారులు వెల్లడించారు. సునామీతో భారీ అలలు తీరానికి పోటెత్తడంతో 70మంది మృతి చెందారు. సుమారు 600మందికిపైగా గాయపడినట్లు దేశ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

సునామీ పోటెత్తడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని.. నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తుసంస్థ పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

దక్షిణ సమత్రా, పశ్చిమ జావాలోని బీచ్ లో సునామీ వచ్చినట్లు వెల్లడించారు. బాధితులకు తక్షణం పునరావాసం కల్పిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తప్పిపోయిన వారి కోసం గాలిస్తున్నారు.