Begin typing your search above and press return to search.

స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు: సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   26 May 2022 6:30 AM GMT
స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు: సుప్రీంకోర్టు
X
సెక్సు వర్కర్లకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని సంచలన తీర్పు ఇచ్చింది. వారిని వేధించొద్దని పోలీసులకు, మీడియాకు ఆదేశాలు జారీ చేసింది. వారిని ఏ విధంగానూ వేధించవద్దని తేల్చిచెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎక్కడైనా సెక్సు వర్కర్లు పట్టుబడితే వారి ఫొటోలను ప్రచురించవద్దని మీడియా సంస్థలకు సూచించింది. అందరికీ గౌరవ మర్యాదలు ఇచ్చినట్టుగానే సెక్సు వర్కర్లకు ఇవ్వాలని కోరింది.

సెక్సు వర్కర్లపై భౌతికంగా దాడి చేయడం, మాటలతో వేధించడం చేయొద్దని ఆదేశించింది. సెక్సు వర్కర్లతో పోలీసులు మర్యాదగా నడుచుకోవాలంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలో కూడిన ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

సెక్సు వర్కర్ల గుర్తింపు తెలిసేలా ఫొటోలు ప్రచురించినా, వార్తలు రాసినా ప్రచురణకర్తలపై ఐపీసీ 354సీ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే సెక్సు వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపింది. ఈ సిఫారసులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. వ్యభిచారం చేయడం చట్ట విరుద్ధం కాకపోయినా వ్యభిచార గృహాలు నిర్వహించడం మాత్రం చట్ట విరుద్ధమేనని సుప్రీంకోర్టు తెలిపింది. అలాంటి వ్యభిచార గృహాలపై దాడి చేసినప్పుడు అక్కడ స్వచ్ఛందంగా ఉంటున్న సెక్సు వర్కర్లను అరెస్టు చేయొద్దని కోర్టు సూచించింది. అలాగే ఆ సెక్సు వర్కర్లను అరెస్టు చేయడం లేదంటే వేధించడం, శిక్షించడం చేయొద్దని స్పష్టం చేసింది. అలాగే ఏ సెక్సు వర్కర్ అయినా లైంగిక దాడికి గురయితే ఇతరులకు మాదిరిగానే వారికి కూడా సౌకర్యాలు కల్పించాలని కోర్టు సూచించింది. అలాగే వైద్య సేవలు అందించాలంది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఐపీసీ 354సీ సెక్షన్ కింద ఇతరుల లైంగిక కార్యకలాపాలను చూడటం నేరం. కాబట్టి ఈ సెక్షన్ ను ఎలక్ట్రానిక్ మీడియాపై కఠినంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్సు వర్కర్ల ఫొటోలు, వారి వివరాలు ప్రచురించడం, ప్రసారం చేయడం చేయకూడదని కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.

అలాగే సెక్సు వర్కర్లు తమ ఆరోగ్యం, భద్రత కోసం తమ దగ్గర కండోములు ఉంచుకుంటే వాటి ఆధారంగా పోలీసులు వారిపై చర్యలు చేపట్టడానికి వీల్లేదని స్సష్టం చేసింది. అలాగే సెక్సు వర్కర్లందరికీ ఆధార్ కార్డు జారీ చేయాలని పేర్కొంది. అవి ఇచ్చేటప్పుడు వాటిపై సెక్సు వర్కర్ అని పేర్కొనకూడదని ఆదేశించింది.