Begin typing your search above and press return to search.

ఏపీలో వాలంటీర్లు.. ఎంత చెప్పుకొన్నా త‌క్కువే!

By:  Tupaki Desk   |   7 Nov 2022 2:30 AM GMT
ఏపీలో వాలంటీర్లు.. ఎంత చెప్పుకొన్నా త‌క్కువే!
X
వాలంటీర్లంటే సేవకులు..! సీఎం జగన్‌ మాటల్లో చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా పథకాలు ప్రజలకు చేరవేసే సైన్యం..! కానీ, జగనన్న మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు వైసీపీ నేతలు..! అక్కడ ప్రజా సేవంటే పార్టీ సేవ. అధికార పార్టీ నేతలకు బాకా ఊదాలి. చెప్పినట్లు తలాడించాలి. ఔను వైసీపీ నేతల ఫోటోలను ప్రభుత్వ వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టలేదని సస్పెండ్‌ చేశారంటూ.. అనంతపురం జిల్లా కౌకుంట్లలో ముగ్గురు వాలంటీర్లు రోడ్డున ప‌డ్డారు.

``రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా.. ఎంత వస్తుంది అని లెక్కలు వేసుకోకుండా సేవ ఎంత అని లెక్క వేసుకుని, పేదల కళ్లల్లో సంతోషం చూడటానికి గుండెల నిండా మానవతావాదన్ని నింపుకుంటున్న.. నా చెల్లేళ్లు, తమ్ముళ్లందరికీ సెల్యూట్ చేస్తున్నాము`` ఇవీ.. వాలంటీర్లను ఉద్దేశించి జగన్ అన్న మాటలు.

అయితే.. ఇది క్షేత్ర‌స్థాయిలో ఇలానే అమ‌ల‌వుతోందా? అంటే లేదు. రాజకీయాలకు అతీతంగా పనిచేయించాల్సిన వ‌లంటీర్ల‌ను.. రాజ‌కీయంగానే చూస్తున్న నాయ‌కులు పెరుగుతున్నారు. వారి మాట విన‌క‌పోతే సస్పెన్షన్ చేసేస్తున్నారు. దీంతో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు జ‌గ‌న్ తోడు ఉందా? లేదా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఏం జ‌రిగిందంటే..

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామ సచివాలయ వాలంటీర్లుగా పనిచేసిన మధు, విష్ణువర్ధన్, సరస్వతిని ఇటీవలే పంచాయతీ కార్యదర్శి విధుల నుంచి తప్పించారు. వీళ్లేమైనా లబ్దిదారుల్ని వేధించారా? పథకాల్ని పక్కదారిపట్టించారా? అంటే అదేమీ లేదు. అంతేకాదు, వీరిని స‌స్పెండ్ చేశార‌ని, విధుల నుంచి తీసేశార‌ని తెలుసుకున్నాక‌.. గ్రామస్థులు సైతం విల‌విల్లాడారు.

వాళ్లు పని బాగానే చేస్తారని అంటున్నారు. వాలంటీర్ సేవలు సక్రమంగా అందించే వారని.. పింఛన్లు అందించే వారని తెలిపారు. సమాయానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూసేవారన్నారు. ప్రజలదృష్టిలో వీళ్లు సేవారత్నాలే! కాకపోతే వైసీపీ నేత‌లు ఆశించిన సేవలు అందించలేక బలైపోయారనే వాద‌న వినిపిస్తోంది. అక్టోబర్‌ మొదటి వారంలో కౌకుంట్ల గ్రామ వైసీపీ కమిటీ ఎన్నికైంది. కమిటీ సభ్యులు మండల పోలీసు అధికారులను సత్కరించారు. ఆ ఫోటోలను ప్రభుత్వ పథకాల సమాచారం చేరవేసే వాట్సప్ గ్రూపుల్లో పెట్టి ప్రచారం కల్పించాలని వైసీపీ కమిటీ సభ్యులు హుకుం జారీచేశారు. అందుకు నిరాకరించడంతో కనీసం మెమో కూడా ఇవ్వకుండానే సస్పెండ్‌ చేశారని వ‌లంటీర్లు వాపోతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ పెద్ద‌లు స్పందిస్తారా? లేదా ? చూడాలి.