Begin typing your search above and press return to search.

బీసీల హితుడు జ‌గ‌నే!... ఆర్‌.కృష్ణ‌య్య వాద‌న ఇదే!

By:  Tupaki Desk   |   31 March 2019 1:21 PM GMT
బీసీల హితుడు జ‌గ‌నే!... ఆర్‌.కృష్ణ‌య్య వాద‌న ఇదే!
X
మ‌రో 12 రోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటు ఏపీలోని ఎంపీ సీట్ల‌కు జ‌ర‌గ‌నున్నపోలింగ్ లో విప‌క్ష వైసీపీకి జ‌నం ఓట్లు పోటెత్తేలానే క‌నిపిస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ఆయా ప్రాంతాల నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు, కులాలు, వ‌ర్గాలు... చివ‌ర‌కు ఓట‌ర్లు కూడా జ‌న‌గ్ మంత్ర‌మే ప‌ఠిస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. గ‌తంలో జ‌రిగిన ఏ ఒక్క ఎన్నిక‌తో ఏమాత్రం పోలిక లేని ఈ ఎన్నిక‌ల్లో కులం కార్డు బాగానే ప‌నిచేస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కులం కార్డు అంటే... త‌మ కులం, వ‌ర్గానికి ఏ పార్టీ మేలు చేసింద‌న్న కోణాన్నిబ‌య‌ట‌కు తీస్తున్న ఆయా వ‌ర్గాలు, కులాలు... ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీల‌కే ఓటేసే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న లేక‌పోలేదు. దీంతో అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా కులాల వారీగా ఓట్ల‌ను దండుకునేందుకు త‌మ‌దైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నాయ‌నే చెప్పాలి. ఇందులో భాగంగా ఆయా పార్టీలు విడుద‌ల చేస్తున్న మేనిఫెస్టోలు, ఇప్ప‌టికే ఇచ్చిన‌, ఇంకా ఇవ్వ‌బోతున్న హామీల ఆధారంగానే ఆయా వ‌ర్గాల ఓట్లు ఆయా పార్టీలకు ద‌క్క‌నున్నాయి.

ఈ లెక్కంతా బాగానే ఉన్నా... జ‌నాభాలో మెజారిటీగానే కాకుండా ఓట‌ర్ల‌లోనూ మెజారిటీ వ‌ర్గంగా ఉన్న బీసీల ఓట్లు ఎటు ప‌డితే.... విజ‌యం దాదాపుగా అటువైపేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ... త‌న‌ను తాను బీసీల పార్టీగా చెప్పుకుంటున్న వైనం మ‌న‌కు తెలిసిందే. గ‌తంలో ఎన్టీఆర్ హ‌యాంలో టీడీపీ నిజంగానే బీసీల పార్టీగానే ఉంద‌ని చెప్పాలి. అయితే పార్టీ చంద్ర‌బాబు చేతుల్లోకి వ‌చ్చాక క్ర‌మంగా బీసీల‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చింది. త‌న సొంత సామాజిక వ‌ర్గానికి పెద్ద పీట వేసుకుంటూ సాగుతున్న చంద్ర‌బాబు... బీసీల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లా లేద‌నే చెప్పాలి. ఈ త‌ర‌హా మార్పు ఇప్పుడు చంద్ర‌బాబులో చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ టికెట్ పై పోటీ చేయ‌డంతో పాటుగా టీడీపీ గ‌నుక అధికారంలోకి వ‌స్తే.... తెలంగాణ సీఎం అభ్య‌ర్థి ఆయ‌నేన‌ని ప్ర‌చారం జ‌రిగిన బీసీ సంఘాల ఉద్య‌మ నేత ఆర్‌.కృష్ణ‌య్య‌... ఇప్పుడు చంద్ర‌బాబు అస‌లు రూపాన్ని బాగానే అర్థం చేసుకున్న‌ట్టున్నారు.

అందుకే... ఇప్ప‌టికే వైసీపీకి జైకొట్టిన కృష్ణ‌య్య‌.. అస‌లు తాను టీడీపీ నుంచి వైసీపీ వైపు ఎందుకు మొగ్గాన‌న్న విష‌యాన్ని ఆయ‌న ఏమాత్రం మోహ‌మాటం లేకుండానే చెప్పేస్తున్నారు. ఇందుకు రికార్డెడ్ ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా ఆయ‌న చూపెడుతున్నారు. ఏపీలో ఎన్నిక‌ల హీట్ బాగా పెరిగిపోయిన వేళ‌... ఆదివారం కృష్ణా జిల్లా మైల‌వ‌రం వ‌చ్చిన కృష్ణ‌య్య‌... ఈ విషయంపై చాలా స్ప‌ష్టంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టకుండా చంద్రబాబు బీసీలను మోసం చేశారనిఆయ‌న ఆరోపించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి ఐదుగురు ఎంపీలతో పోరాడిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్‌ బిల్లులు ఉన్నాయో, బీసీలకు కూడా ఆ ప్రకారమే ఏర్పాటు చేయాలని కృష్ణ‌య్య‌ కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన శాసనసభ్యులతో బీసీలకు ప్రైవేటు బిల్లు పెట్టేవిధంగా తీర్మానం చేశార‌ని ఆయ‌న‌ ప్రశంసించారు. మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ కూడా బీసీల బిల్లు కోసం పోరాడిన దాఖలాలు లేవని విమర్శించారు.ఈ లెక్క‌న బీసీల పార్టీ ఏదో ఇట్టే అర్థం అవుతోంద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే ఏప్రిల్‌ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓటేయాలని ఆయ‌న బీసీల‌కు పిలుపునిచ్చారు.