Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులు కాస్త రిలాక్స్ అవ్వ‌చ్చు!

By:  Tupaki Desk   |   22 Oct 2016 8:01 AM GMT
ఏపీ మంత్రులు కాస్త రిలాక్స్ అవ్వ‌చ్చు!
X
ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌తి స‌మావేశంలోనూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్తున్న మాట‌. త్వ‌ర‌లో వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యం బాధ్య‌త‌ మంత్రుల‌దేన‌ని తేల్చిచెప్ప‌డం. బాబు క‌రాఖండీగా చెప్పేయ‌డంతో మంత్రులు సైతం క్షేత్ర‌స్థాయిలో జోరుగానే ప‌ర్య‌టిస్తున్నారు. అయితే ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న స్థానిక సంస్థలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పించడం లేదంటున్నారు. రాష్ట్రంలో నాలుగు కార్పొరేషన్లు - ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈనెల 31తో ప్రారంభమై జనవరి 14తో ముగుస్తుంది. దీంతో 2014లో ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన మున్సిపాలిటీలు - కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణలో జాప్యం అనివార్యంగా కన్పిస్తోంది.

స‌ద‌రు పుర‌పాల‌క ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన చోట‌ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ముసాయిదా ఈనెల 31న విడుదల చేస్తారు. ఈనెల 31 నుంచి నవంబర్‌ 30 వరకూ ఓటర్ల జాబితాల్లో మార్పులు - చేర్పులకు అవకాశం కల్పిస్తారు. అనంతరం అభ్యంతరాలు - మార్పులు - చేర్పులతో కూడిన జాబితాలను డిసెంబరు 15 నాటికి ముసాయిదా జాబితాల ప్రకటిస్తారు. వీటిని కంప్యూటరీకరించి జనవరి 14న తుది జాబితా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ లెక్క‌న‌ నవంబరు - డిసెంబరు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్లు వస్తాయని చెబుతూ వస్తున్న అధికార పార్టీ ప్రకటనలు ఇప్పట్లో ఆచరణ సాధ్యం కాన‌ట్లే. జనవరి 15 తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు స్థానిక సంస్థల నుంచి ఓటర్ల జాబితా చేరిన తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఫిబ్రవరి 15 తరువాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే వార్డుల పునర్విభజన లేదా పునర్‌ వ్యవస్థీకరణ కూడా ప్రకటించాల్సి ఉంది. అలాగే జిల్లా అధికారులు వార్డులు - లేక డివిజన్ల రిజర్వేషన్లు కూడా ప్రకటించాల్సి ఉంది.

మ‌రోవైపు మేయర్‌ - మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం ఆలోచనపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రాజకీయంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ ఎమ్మెల్యేల మృతి కారణంగా నందిగామ - తిరుపతి ఉప ఎన్నికలు మినహా ఎక్కడా ఎన్నికలు జరగలేదు. దీంతో మున్సిపల్‌ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడతాయని అధికార పార్టీ నేతలే ఈ ఎన్నికలపై ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది కాలంగా అదిగో..ఇదిగో అంటూ మునిసిపల్‌ మంత్రి - ఇతర మంత్రులు త్వరలో మునిసిపల్‌ ఎన్నికలంటూ ఆయా ప్రాంతాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నా చట్టపరంగా ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయ్యే వరకూ జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/