Begin typing your search above and press return to search.

పాలేరు ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోవటం ఖాయం

By:  Tupaki Desk   |   8 May 2016 4:46 AM GMT
పాలేరు ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోవటం ఖాయం
X
హెడ్డింగ్ చూసి మీరు మరోలా అనుకోవచ్చు. కానీ.. మా ఉద్దేశం అందుకు పూర్తి భిన్నం. పాలేరు ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందంటే.. అది రాజకీయంగా కాదు.. ఎన్నికల సంస్కరణలో సరికొత్త విధానానికి ఈ ఎన్నిక పోలింగ్ నాంది కానుంది. దేశ ఎన్నికల చరిత్రలో సరికొత్త అడుగుకు ఈ ఎన్నిక మొదలు కానుంది. ఇంతకీ ఈ ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోవటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. పాలేరు పోలింగ్ లో ఓటు వేసిన ఓటరు తాము ఏ పార్టీకి ఓటు వేశామో ఆ పార్టీకే ఓటు పడిందా? లేదా? అన్న విషయాన్ని సరి చూసుకునే అవకాశం తొలిసారి అందుబాటులోకి రానుంది.

దీంతో.. ఈవీఎంల మీద నెలకొన్న అభ్యంతరాలు తొలిగిపోవటం ఖాయమని చెబుతున్నారు. ఓటరు ఓటు వేసిన తర్వాత తాము ఓటు వేసిన పార్టీకే తమ ఓటు పడిందా? లేదా? అని చెక్ చేసుకోవటానికి వీలుగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ సాంకేతికతను వినియోగించనున్నారు. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా 243 పోలింగ్ కేంద్రాల్లో ఈ విధానాల్ని ఓటర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ సాంకేతికతతో ఈవీఎం మెషీన్ల మీద వెల్లువెత్తే ఆరోపణలకు చెక్ పడటం ఖాయమంటున్నారు. ఇంతకీ ఈ విధానంలో ఓటరు తాము వేసిన ఓటు.. తాము వేసిన పార్టీకే పడిందా? లేదా? అన్నది ఎలా చెక్ చేసుకోవాలన్న విషయానికి వస్తే.. ఓటరు ఓటరు వేసిన తర్వాత..ఆ బ్యాలెట్ పేపర్ ను ప్రింటర్ ప్రింట్ చేస్తుంది. అయితే.. ఈ స్లిప్ ను ఓటరు చేతికి ఇవ్వరు. ప్రింట్ అయిన స్లిప్ అద్దంలో కనిపిస్తుంది. అది ఏడు సెకన్లు మాత్రమే కనిపిస్తుంది. అనంతరం ప్రింటర్ డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. ఒకవేళ తాము వేసిన ఓటు సదరు పార్టీకి కాక మరో పార్టీకి పడినట్లుగా ఓటరు అభ్యంతరం వ్యక్తం చేస్తే మరోసారి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే.. అతగాడి అభ్యంతరం నిజం కాదని తేలితే మాత్రం పోలీసు కేసు నమోదు చేస్తారు. పాలేరు ఉప ఎన్నిక ద్వారా అందుబాటులోకి రానున్న సరికొత్త టెక్నాలజీ రాజకీయ పార్టీలు ఓకే చేస్తాయో? లేదో..?