Begin typing your search above and press return to search.

ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు!

By:  Tupaki Desk   |   23 Oct 2019 4:37 AM GMT
ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు!
X
మరోలా అనుకోకండి.. మీరే బటన్ నొక్కినా ఓటు పడేది బీజేపీకే అంటూ ఒక బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యను ఆయన ఏ రీతిలో సమర్థించుకున్నా.. అచ్చం ఆయన చెప్పినట్లే మహారాష్ట్రలోని ఒక అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకుందన్న రచ్చ మొదలైంది. ఇంతకీ ఇదెక్కడంటే.. మహారాష్ట్రలోని కోరెగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది.

ఇక్కడ ఎవరికి ఓటేసినా బీజేపీకే పడుతోందని.. ఏ బటన్ నొక్కినా బీజేపీ గుర్తైన కమలం పువ్వు ముందు లైటు వెలగటంపై అభ్యంతరం వ్యక్తమైంది. అయితే.. ఆ అభ్యంతరాల్లో నిజం లేదంటున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కీర్తి నలవాడె. గ్రామస్తులకు భిన్నమైన వాదనను ఆయన వినిపిస్తున్నారు. బటన్ లో చోటు చేసుకున్న సాంకేతిక సమస్య కారణంగానే అలాంటిది జరిగిందే తప్పించి.. మరింకేమీ లేదంటున్నారు.

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈవీఎం మార్చిన మాట వాస్తవమే కానీ.. వారి ఆరోపణలు మాత్రం నిజం కాదని ఆయన చెబుతున్నారు. ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్ కు ఓటు వేస్తే బీజేపీ అభ్యర్థి ఉదయన్ రాజే భోసలేకు ఓటు పడటానని గ్రామానికి చెందిన మాజీ డిప్యూటీ సర్పంచ్ గళం విప్పటంతో రచ్చ మొదలైంది.

ఆయన మాటకు తాను కూడా సాక్ష్యమంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే శశికాంత్ షిండే వ్యాఖ్యానించారు. ఎన్సీపీకి ఓటు వేయాలని తాను బటన్ నొక్కక ముందే బీజేపీకి చెందిన బటన్ పక్కనున్న రెడ్ లైట్ వెలిగినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. బటన్ లోని లోపంతోనే అలా జరిగిందన్న రిటర్నింగ్ అధికారికి.. ఈవీఎంను మార్చిన తర్వాత రచ్చ సద్దుమణిగింది.