Begin typing your search above and press return to search.

తెలంగాణలో పెరుగుతున్న పోలింగ్ శాతం..ఎంతంటే?

By:  Tupaki Desk   |   7 Dec 2018 8:26 AM GMT
తెలంగాణలో పెరుగుతున్న పోలింగ్ శాతం..ఎంతంటే?
X
తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు పోలింగ్ స్టేషన్ ల ముందు బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణ వ్యాప్తంగా 49శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో మాత్రం 28 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇంకా నాలుగు గంటలు సమయం మాత్రం ఉండడంతో ఓటింగ్ శాతం పెరుగుతుందా..? తగ్గుతుందా అన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది..

తెలంగాణ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో 50 నుంచి 51శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఇదే రోజు ఓటింగ్ జరుగుతున్న రాజస్థాన్ లో కేవలం 41శాతం మాత్రమే నమోదవడం గమనార్హం. భూపాలపల్లిలో 50 శాతం.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ లో 51శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలు కాగా.. పలు చోట్ల ఈవీఎంల అవాంతరాల మధ్య 30 నుంచి 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ నమోదైంది.

అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే 1 గంటలకే 50శాతానికి పోలింగ్ నమోదు కావడం మంచి పరిణామమని పోలింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ శాతం పెరిగే ప్రతిపక్షానికి అనుకూలమని.. తగ్గితే అధికార పక్షానికి అనుకూలమనే వాదన వినపడుతోంది. అయితే ఓటింగ్ పెరిగినా.. తగ్గినా ఓటర్ల అభిప్రాయం మాత్రం తేటతెల్లం కానుంది. ఓటర్లు ఈసారి ఖచ్చితంగా తమను పాలించే వారి తలరాతను నిర్ణయించబోతున్నారని.. వారి మదిలో ఉన్న పార్టీ ఎవరనేది 11న తేలనుంది.

అయితే హైదరాబాద్ లో ఓటింగ్ పర్సేంటేజీ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో పోలింగ్ కారణంగా 6 నుంచి 9వరకు వరుస సెలవులు వచ్చాయి. ఈ కారణంగానే హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు , టూర్లకు వెళ్లినట్టు అర్థమవుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆశావాహంగా పోలింగ్ నమోదైనా హైదరాబాద్ లో మాత్రం తగ్గిపోయింది.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ ‘తెలంగాణలో పోలింగ్ చాలా బాగా జరుగుతోంది. ఓటింగ్ శాతం పెరుగుతోంది. తెలంగాణ ఓటర్లకు ధన్యవాదాలు ’ అంటూ చెప్పుకొచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై జరిగిన దాడిపై జిల్లా ఎన్నికల అధికారి ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

అయితే 1 గంట వరకు 49శాతం తెలంగాణ వ్యాప్తంగా నమోదైన దృష్ట్యా సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 80శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే తెలంగాణ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైనట్టే లెక్కా..