Begin typing your search above and press return to search.

ఉండవల్లి అంత క్లియర్ గా చెప్పాక జగన్ మౌనానికి అర్థమేంది అధ్యక్షా?

By:  Tupaki Desk   |   14 Jun 2022 2:30 PM GMT
ఉండవల్లి అంత క్లియర్ గా చెప్పాక జగన్ మౌనానికి అర్థమేంది అధ్యక్షా?
X
సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. తాను కోరుకున్నట్లే ఒక్క చాన్సును సొంతం చేసుకోవటం తెలిసిందే. మరి.. అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. ఎన్నికల వేళలో తానిచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో ఆయన తీరు తేడాగా ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. హోదా విషయంలో మడమ తిప్పమన్న ఆయన.. ఇప్పుడా ఊసే విడిచిపెట్టేయటం తెలిసిందే.

అంతేనా.. తాను విజయం సాధిస్తే రాజధానిగా అమరావతిని పక్కాగా కంటిన్యూ చేస్తానని మాటిచ్చిన ఆయన.. తర్వాతి కాలంలో మూడు రాజధానులు ఏపీకి ముచ్చటగా ఉంటాయని చెప్పటం తెలిసిందే. పోలవరం విషయంలో ఆయన చెప్పిన మాటకు.. చేతలకు ఏ మాత్రం పొంతన లేని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆయన సీఎంగా ఉన్న మూడేళ్ల కాలంలో ఏపీకి ఏం ఒరిగిందన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి.

మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యేక హోదా సాధించేందుకు.. తమ డిమాండ్లను కేంద్రానికి చెప్పి చేయించుకోవటానికి వీలుగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే విషయంలో జగన్ సర్కారుకు అస్సలు పట్టటం లేదనే విమర్శ వినిపిస్తోంది. సీనియర్ నేత ఉండవల్లిలాంటి వారి మాటల్లో చెప్పాలంటే.. 'ఏపీకి ప్రత్యేక హోదా.. విభజన హామీల్ని అమలు చేయించుకునే దిశగా బీజేపీ సర్కారు దిగి వచ్చేలా చేయటానికి ఇప్పుడో మంచి అవకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో లభించింది.

ఇలాంటి అవకాశం ఎప్పుడు లభించదు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సరిపడా బలం లేదు. ఇతర పార్టీల మద్దతు చాలా అవసరం. వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీలు.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపులో మోడీ సర్కారుకు జగన్ అవసరం చాలా ఉంది. ఇలాంటి వేళ.. ఏపీ డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చి నెరవేర్చుకునే వీలుంది'' అన్న ఆయన మాటల్లో నిజం ఉంది.

కానీ.. కేసుల భయం సీఎం జగన్ నోటి నుంచి మాట రానివ్వకుండా చేస్తుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ మద్దతు కావాలంటే రాష్ట్రానికి మేలు చేసే డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించాలని జగన్ కోరాలని ఉండవల్లి చెబుతున్నారు. నిజమే.. ఆయనమాటల్లో నిజం ఉంది. కానీ.. అంత ధైర్యం చేసే పరిస్థితి జగన్ కు ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఆయనపై పెండింగ్ లో ఉన్న కేసులు.. జగన్ కు అత్యంత సన్నిహితుల మీద ఉన్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో.. వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ కారణంతోనే జగన్ మౌనంగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది. ఉండవల్లి చెప్పిన మాటల్ని విన్నంతనే నిజమేగా అనిపిస్తుంది. కానీ.. తరచి చూస్తే.. ఉండవల్లి మాటలకు టెంప్టు అయితే.. ఏం జరుగుతుందన్న విషయంపై జగన్ కున్న అవగాహనే.. ఆయన్ను మౌనంగా ఉండేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏపీ ప్రజల సుడి ఎప్పుడూ ఇలానే ఉంటుంది. వారి ప్రాంతం బాగుపడటానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఛాన్సు అంటూ చెప్పి మరీ గెలిచిన జగన్ వారి ఆశలకు.. ఆకాంక్షలకు చాయిస్ లేకుండా చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.