Begin typing your search above and press return to search.

జగన్ పక్కా బిజినెస్ మ్యాన్.. ఎందుకో చెప్పిన ఉండవల్లి

By:  Tupaki Desk   |   23 Sep 2021 4:30 PM GMT
జగన్ పక్కా బిజినెస్ మ్యాన్.. ఎందుకో చెప్పిన ఉండవల్లి
X
రాజకీయాల్లో కనిపించే సిత్రాలు మరెక్కడా కనిపించవనే చెప్పాలి. ఒకే కుటుంబాన్ని రెండుముక్కలు చేసే టాలెంట్ రాజకీయానికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఉంటే గింటే డబ్బు కారణం కూడా ఉండొచ్చు కానీ.. రాజకీయం కారణంగా ఏర్పడే విరోధం చాలా వయలెంట్ గా ఉంటుంది. ఇక.. రాజకీయాల్లో తండ్రిని అభిమానించి.. ఆరాధించిన వారు.. ఆయన కుమారుడ్ని అంగీకరించటానికి ఇష్టపడరు. ఈ విషయం దివంగత మహానేత వైఎస్ విషయంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ విషయంలో కానీ.. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలోనే కాదు.. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీలోనూ అలాంటి పరిస్థితే. సోనియమ్మకు వీర విధేయులుగా ఉంటే సీనియర్లు.. రాహుల్ విషయానికి వచ్చేసరికి.. ఆయన చేతికి పార్టీ పగ్గాలు ఇచ్చే విషయంలో అంత ఆసక్తిని చూపించరు.

ఈ కారణంగానే.. తన కొడుక్కి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి అయితే ఫాంహౌస్ లేదంటే.. జాతీయ రాజకీయాల వైపు ఫోకస్ చేద్దామని కేసీఆర్ అనుకుంటే.. ఆయన కోరికను తీరకుండా చేయటంలో ఆయన పార్టీకి చెందిన వారే కీలకంగా వ్యవహరించటం.. రెండు..మూడుసార్లు ప్రమాణస్వీకారానికి ముహుర్తం నిర్ణయించి మరీ వెనక్కి తగ్గటం కనిపిస్తుంది. కేసీఆర్ లాంటి తిరుగులేని నాయకుడి విషయంలోనే చోటు చేసుకున్నప్పుడు మిగిలిన వారి విషయంలో అలాంటిది ఎందుకు ఉండదు చెప్పండి. దివంగత మహానేత వైఎస్ ను విపరీతంగా అభిమానించి ఆరాధించే కేవీపీ కావొచ్చు.. ఉండవల్లి కావొచ్చు.. జగన్ వరకు వచ్చేసరికి.. ఆయనకు దూరంగా ఉండటం కనిపిస్తుంది. ఎందుకిలా? అంటే రాజకీయాల్లో అలాంటి పరిస్థితే ఉంటుంది. ఎవరి టీం వారికి ఉండటం.. ఒకరి మైండ్ సెట్ మరొకరిలో లేకపోవటం ఒక కారణాలుగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే.. వైఎస్ ను మాట వరసకు కూడా విమర్శ చేయటానికి ఇష్టపడని ఉండవల్లి.. ఆయన కుమారుడి పాలన గురించి.. తన అభిప్రాయాల్ని విస్పష్టంగా వెల్లడించారు. సీఎం జగన్ మీద తన అభిమానాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూనే.. పాలనలో ఆయన చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించేందుకు వెనుకాడరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారు అన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

- జగన్ పక్కా బిజినెస్ మ్యాన్. వ్యాపార లెక్కల్లో అతనికి మించిన వాడు లేడు. రాష్ట్రానికి సంబంధించి కూడా అతనికి లెక్కలు తెలీకుండా ఉంటాయని అనుకోవట్లేదు. అతని వ్యూహం ఏదో ఒకటి ఉండి ఉంటుంది. అతని వ్యూహం విజయవంతమైంది కదా?

- కొవిడ్ మోడీకి శాపమైంది. జగన్ కు వరమైంది. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటో? ఆయనకు.. ఆయన సన్నిహితులకే తెలియాలి. మనకు తెలీదు. ఇదో కొత్త పోకడ. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు రెండు ప్రాంతీయ పార్టీలు అధికార.. విపక్షంలో ఉండటం ఇదే ప్రధమం.

- సలహాదారులుగా ఉండాలంటే ఏదో ఒక అంశం మీద పట్టు ఉండాలి. వైఎస్ హయాంలో పాత్ర పోషించటం అంటే.. పాత నీరు పోవటం.. కొత్త నీరు రావటం మామూలే కదా. గోదావరిలో కూడా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్లిపోతుంది కదా?

- రోడ్లు.. ఏమీ లేవు. దేని మీదా రూపాయి పెట్టటం లేదు కదా? నవరత్నాలకు అవసరమైన నిధులు తేవటమే వారి ముందున్న అతి పెద్ద సమస్య.

- ఇప్పుడున్న నవరత్నాల్లో.. ఒకట్రెండు రత్నాల్ని పక్కన పెడితే ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది. ఒకవేళ తీసేసినా.. దాన్ని వివరించే సామర్థ్యం.. ప్రజల్ని ఒప్పించటం చాలా అవసరం. రాజమండ్రిలో వైసీపీకి చెందిన వార్డు మెంబర్ తాజాగా నాతో మాట్లాడాడు. వాళ్ల వార్డులో తొంభై మంది పెన్షన్లు తీసుకున్నారని.. అందులో అరవై మంది అర్హులు కాదని. వితంతువు అయితే చాలు పెన్షన్ కు అర్హత వచ్చేసిందని అనుకుంటున్నారు. వాళ్లకు మేడ ఉన్నా కూడా. ఒక వార్డులో 90 మందికి ఇస్తుంటే.. తాజాగా ఏడుగురికి నోటీసులు వెళ్లాయంట. మిగిలిన వారంతా అతనింటికి వెళుతున్నారట. మా ఫించన్ల పరిస్థితి ఏమిటని? ప్రశ్నిస్తున్నారు.

- పార్టీ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ టోటల్ ఫెయిల్. తెలుగుదేశం పార్టీలో ఇంకా పార్టీ ఉంది. ముందు నుంచి ఓన్లీ జగన్ మాత్రమే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. 2014 నుంచి కూడా వైఎస్సార్ సీపీ అంటే జగన్ మాత్రమే. ఇంకెవరు ఉండరు.