Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ రాజ‌భోగాలు తెలిస్తే షాక‌వ్వాల్సిందే!!

By:  Tupaki Desk   |   15 Aug 2017 9:58 AM GMT
చిన్న‌మ్మ రాజ‌భోగాలు తెలిస్తే షాక‌వ్వాల్సిందే!!
X
`అమ్మ` త‌ర్వాత అమ్మ అయిన ఆమె సీఎం త‌ర్వాత సీఎం కాలేక‌పోయింది!! అందుకు విశ్వ‌ప్ర‌యత్నాలు చేసినా.. `అమ్మ స‌మాధి`పై మూడు సార్లు గ‌ట్టిగా కొట్టి మ‌రీ శ‌ప‌థం చేసినా.. ఇవేమీ సీఎం పీఠం ఎక్కించ‌లేక‌పోయాయి స‌రిక‌దా క‌ట‌క‌టాల వెన‌క్కు తోసేశాయి. `అమ్మ` జ‌య‌లలిత‌ ఉన్న స‌మ‌యంలో తెర‌వెనుక రాజ‌కీయాలు న‌డిపిన ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌.. ఇప్పుడు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఎలాంటి జీవితం అనుభ‌విస్తున్నారనే ప్ర‌శ్న అంద‌రి లోనూ ఉంది. ఇప్పుడు ఆమె జైలు జీవితం గురించి దిమ్మ‌తిరిగే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అక్క‌డ ఆమె రాజ‌భోగాలు అనుభవిస్తూ.. రాయ‌ల్ ల‌గ్జ‌రీ లైఫ్ గ‌డుపుతున్నార‌ట‌.

త‌మిళ రాజకీయాల‌ను శాసించాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించి.. చివ‌ర‌కు భంగ‌పాటుకు గురైన శ‌శిక‌ళ‌కు.. జైల్లో రాజ‌భోగాలు అందుతున్నాయ‌ట‌. సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ) నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద ద‌ర‌ఖాస్తు చేయ‌గా అందులో ఇవ‌న్నీ తేలాయి. శశికళను సాధారణ ఖైదీలగా చూడాల్సిన సెంట్రల్ జైలు అధికారులు.. ఆమెకు రాచ‌మ‌ర్యాద‌లు చేస్తున్నార‌ట‌. ఐదు గదులు - ప్రత్యేక వంట గది - బయటి నుంచి మందులు - భోజనం - కాళ్లు - చేతులు మసాజ్ చెయ్యడానికి పనివారు, వంట చెయ్యడానికి ప్రత్యేకంగా ఓ వంట మనిషి ఇలా ఒక‌టేమిటి.. స‌క‌ల భోగాలు అనుభ‌విస్తున్నార‌ట‌.

జైల్లో శశికళ అసాధారణ ఖైదీగా సేవలు చేయించుకుంటున్నారని, జైలు అధికారులు, సిబ్బందితో ఆమె సిస్టర్ అని పించుకునే స్థాయికి ఎదిగార‌ట‌. జైలు శిక్ష పడిన ఖైదీలు సాధారణంగా నెలకు రెండు సార్లు మాత్రమే తన కుటుంబ సభ్యులు - బంధువులను ములాఖత్ లో మాట్లాడటానికి అవకాశం ఉంది. కానీ ఆమె జూలైలో 1 - 5 - 6 - 11 - 28 - 31 తేదీల్లో ఆరు సార్లు శశికళ తన వారిని కలుసుకున్నారట‌. జూలై 5వ తేదీన జయలలితకు గత సంవత్సరం వరకు వైద్యం చేసిన డాక్టర్ వెంకటేష్ (శశికళ బంధువు) - టీటీవీ దినకరన్ - వెట్రివేల్ - కేవీ రామలింగం - పళనివేల్ (ఎమ్మెల్యేలు) - తమిళ్ మగన్ హుస్సేన్ సందర్శకుల సమయం దాటిపోయినా శశికళతో ములాఖత్ లో మాట్లాడారట‌.

శశికళను జైల్లో ఏడు నెలల్లో 14 మందితో మాత్రమే మాట్లాడే అవకాశం ఉందని, జైళ్ల శాఖ రిజిస్టర్ లో 52 మందితో ఆమె మాట్లాడిన‌ట్లు వివ‌రాలు ఉన్నాయ‌ని, ఇది ఎలా సాధ్యమ‌ని నరసింహమూర్తి ప్రశ్నించారు. అన్ని సాక్షాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి శశికళ బండారం బయటపెడుతానని నరసింహమూర్తి వివరించారని తమిళ సాయంకాల దినపత్రిక తమిళ్ మురసు కథనం ప్రచురించింది. పాపం మ‌రి ఇవ‌న్నీ నిజ‌మేన‌ని తేలితే.. మరోసారి శ‌శిక‌ళ‌కు చిక్కులు త‌ప్ప‌వు!!