Begin typing your search above and press return to search.

ఈ వింత శిక్ష‌ను తెలుగు పోలీసులు ఫాలో అయితే..

By:  Tupaki Desk   |   22 Feb 2018 6:13 AM GMT
ఈ వింత శిక్ష‌ను తెలుగు పోలీసులు ఫాలో అయితే..
X
కొన్ని రూల్స్ ను ఎలాంటి మొహ‌మాటం లేకుండా కచ్ఛితంగా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. డ్రంక‌న్ డ్రైవ్.. హెల్మెట్ లేకుండా వాహ‌నాన్ని న‌డ‌ప‌టం లాంటి వాటి విష‌యంలో పోలీసులు క‌ర‌కుగా వ్య‌వ‌హ‌రించాల్సిందే. సామాజిక బాధ్య‌త లేక‌పోవ‌టం.. అవ‌గాహ‌నారాహిత్యం.. తెంప‌రిత‌నం లాంటి వాటితో ఇలాంటి త‌ప్పులు చేస్తుంటారు.

ఇలాంటి త‌ప్పులు చేసే వారికి రొడ్డు కొట్టుడు ఫైన్లు.. కేసులు క‌ట్టే క‌న్నా వినూత్నంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. తాజాగా అలాంటి విధానాన్ని అమ‌లు చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఆగ్రా పోలీసులు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఆగ్రా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకోకుండా బండి డ్రైవ్ చేసే వారికి ఊహించ‌ని రీతిలో భారీ శిక్ష‌ను విధిస్తున్నారు.

వినేందుకు న‌వ్వు పుట్టించేలా ఉన్న‌ప్ప‌టికీ.. ఒక‌ట్రెండుసార్లు ఆ శిక్ష‌ను అనుభ‌వించిన వారు.. హెల్మెట్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు రావ‌టానికి వ‌ణికేలా ఉంటుంద‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆ విచిత్ర‌మైన శిక్ష ఏమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఎవ‌రైనా హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద‌కు వ‌స్తే.. వారిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటారు.

వారిని తిట్ట‌టం.. చ‌లానాలు వేయించ‌కుండా.. 500 మీట‌ర్ల దూరాన్ని బైక్ తో న‌డ‌వాల‌ని కోరుతారు. మొద‌ట న‌వ్వుతో మొద‌ల‌య్యే ఈ శిక్ష‌.. 500 మీట‌ర్లు బండి ప‌ట్టుకొని న‌డుచుకొని రావ‌టం చుక్క‌లు క‌నిపించ‌టం ఖాయం. ఈ స‌రికొత్త శిక్ష అక్క‌డి వారిపై ప్ర‌భావం చూపిస్తోంద‌ని చెబుతున్నారు. ఇలాంటి శిక్ష‌ల‌కు లొంగ‌ని వారు కొంద‌రు ఉన్నా.. చాలామంది మాత్రం మారుతున్నార‌ని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు పోలీసులు సైతం.. హెల్మెట్ పెట్టుకోని వారిపై చ‌లానాల‌తో విరుచుకుప‌డ‌కుండా.. వారిలో చైత‌న్యం రేపేలా ఈ త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.