Begin typing your search above and press return to search.

అమెరికాలో అలాంటి కక్కుర్తి మొదలైందా?

By:  Tupaki Desk   |   22 March 2020 11:30 PM GMT
అమెరికాలో అలాంటి కక్కుర్తి మొదలైందా?
X
కరోనాకు మందు లేదు. ఇవాళ కాకుంటే రేపు వస్తుంది. కాదంటే.. మరో నాలుగైదు నెలల తర్వాతైనా వస్తుంది. కానీ.. మనిషిలో ఉండే భయానికి మాత్రం మందు ఎక్కడా దొరకదు. అదే ఇప్పుడు కొంతమంది స్వార్థపరులకు ఆయుధంగా మారింది. అమెరికా లాంటి డెవలప్ అయిన దేశంలో.. కరోనా నేపథ్యంలో బయటకు వస్తున్న కక్కుర్తి అంశాలు షాకింగ్ గా మారాయి. తమను తాము సివిలైజ్డ్ పీపుల్ గా చెప్పుకునే అమెరికన్లలో.. మరీ ఇంతలా వ్యవహరిస్తారా? అంటే.. కాలమహిమగా చెప్పాలి.

కరోనా విషయంలో అగ్రరాజ్యం ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడా దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని విధించే వరకూ వెళ్లింది. ఎప్పుడేం జరుగుతుందో అన్న భయాందోళనలతో అమెరికన్లు పెద్ద ఎత్తున ఆహార పదార్థాల్ని.. వాటర్ క్యాన్లను.. ఫ్రోజెన్ ఫుడ్ ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో.. భారీ సూపర్ మార్కెట్లు సైతం ఖాళీ అయిపోతున్నాయి. హుస్టన్ లాంటి నగరంలోని వాల్ మార్ట్ లో బియ్యం లేకపోవటం గమనార్హం. ఇదొక్కటే కాదు.. బంగాళదుంపలు.. పెరుగు.. న్యూడిల్స్ ర్యాకులు బోసిపోతున్నాయి.

అమెరికాలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించటంతో ఇంటి నుంచే పని చేస్తున్నారు. రానున్నరోజుల్లో గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉండటంతో.. పెద్ద ఎత్తున ఆహారపదార్థాల్ని ముందస్తుగా కొనుగోలు చేసి ఇంట్లో ఉంచేసుకుంటున్నారు. ఇదేం కక్కుర్తి కాదు కదా? అని మీరు అనుకోవచ్చు. అసలు విషయం ఇక్కడే ఉంది. ఇలా దాచుకున్న తీరుతో మార్కెట్లలో చాలావరకూ స్టాకులు ఖాళీ అయిపోయాయి.

అమెరికాలో నిద్ర లేచిన వెంటనే అవసరమయ్యే టిష్యూ పేపర్లతో సహా.. కొన్నింటికి తీవ్రమైన కొరత ఎర్పడటంతో.. ముందుగా ఇళ్లల్లో స్టాక్ పెట్టుకున్న వారు.. అధిక ధరలకు వాటిని అమ్మేస్తున్న తీరు చూస్తే.. సంక్షోభంలోనూ సంపాదన గుణాన్ని వదలని అమెరికన్ల తీరు విస్మయానికి గురి చేస్తుంది. కరోనా వేళ ఇలాంటి కక్కుర్తి ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.