Begin typing your search above and press return to search.

కష్టపడ్డ సొమ్ముతో తిరుగుతున్నా .. అనుమతి ఎందుకివ్వరు !

By:  Tupaki Desk   |   19 March 2021 9:30 AM GMT
కష్టపడ్డ సొమ్ముతో తిరుగుతున్నా .. అనుమతి ఎందుకివ్వరు !
X
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయం తక్కువగా ఉండడంతో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు జాతీయస్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పార్టీలోని కీలక నేతలు పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాల్సి ఉండటంతో హెలికాఫ్టర్లు, చార్టెడ్‌ ఫ్లయిట్ ల లో వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే, తాజాగా సొంత డబ్బు ఖర్చు పెట్టి హెలికాప్టర్‌ లో తిరుగుతున్నానని, ఇందుకు అనుమతి ఇవ్వకపోవడం ఎమిటో అని అధికారుల తీరుపై విశ్వనటుడు కమలహాసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గురువారం ఎన్నికల ప్రచారం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కమల్ కి ఏర్పడింది. మక్కల్‌ నీది మయ్యం అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కమల్‌ ఉన్నారు.

కోవై దక్షిణం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న దృష్ట్యా, అక్కడి నుంచే సమీప జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. దీనికి ప్రైవేటు హెలికాప్టర్‌ సిద్ధం చేసుకున్నారు. బుధవారం కోవై నుంచి ఈరోడ్‌ కు హెలికాప్టర్‌లో వచ్చి మళ్లీ ప్రచారం చేసి వెళ్లారు. గురువారం కోయంబత్తూరు నుంచి నీలగిరి జిల్లా ఊటి, కున్నురూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి కమల్‌ నిర్ణయించారు. ఉదయం కోయంబత్తూరు నుంచి బయలుదేరి కున్నూరు లేదా, దిట్టకల్‌ వద్ద హెలికాప్టర్‌ నుంచి దిగి, రోడ్డు మార్గంలో ప్రచారానికి నిర్ణయించారు. అయితే, ఆయన హెలికాప్టర్‌ ల్యాండింగ్ ‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచారం ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రచారం రద్దు కావడంతో కోయంత్తూరు ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి తంగవేల్‌ నామినేషన్‌ దాఖలు కార్యాక్రమానికి కమల్‌ హాజరయ్యారు. మీడియాతో కమల్‌ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల్ని కలుసుకునేందుకు, సమయం వృథా కాకుండా వినియోగించు కునేందుకు హెలికాప్టర్‌ పర్యటనను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. కష్టపడ్డ సొమ్ముతో తిరుగుతున్నానని ఎందుకు అనుమతి ఇవ్వడంలేదు అని అన్నారు. 234 నియోజకవర్గాల్లోనూ ప్రజల్ని కలుస్తానని, లభిస్తున్న ఆదరణ చూసి అడ్డుకుంటున్నట్టుందని ఫైర్ అయ్యారు.