Begin typing your search above and press return to search.

అందరికీ ములాయం ఆశీస్సులే కావాలా ?

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:30 PM GMT
అందరికీ ములాయం ఆశీస్సులే కావాలా ?
X
జరుగుతున్న విషయాలు విచిత్రంగా ఉన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున సమాజ్ వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తారసపడ్డారు. ములాయంను కుశల ప్రశ్నలు వేసిన తర్వాత మంత్రి ములాయం కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకవైపేమో ఎస్పీ అధ్యక్షుడు, ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ పై ఇరానీ నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ములాయం ఆశీస్సులు తీసుకున్నారు.

మొన్నటికి మొన్న కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది. ములాయం రెండో భార్య సాధనా గుప్తా కూతురు, కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అఖిలేష్ తో తల్లీ, కూతుళ్లకు పడని కారణంగా ఆమె ఎస్పీని వదిలేసి బీజేపీలోకి జంప్ చేశారు. కమలం పార్టీలో చేరిన తర్వాత ఇంటికి వచ్చి ములాయం ఆశీస్సులు తీసుకున్నారు. అపర్ణ ఇపుడు బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. ఈమె కూడా బావగారు అంటే అఖిలేష్ పై విరుచుకుపడుతున్నారు.

ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే ములాయం ఆశీస్సులు తీసుకున్న ఇద్దరు ప్రత్యర్ధి పార్టీల్లోని వాళ్ళే. ఇద్దరికీ ములాయంతో ఏ మాత్రం పడదు. ఆ మాటకొస్తే ములాయంకు కూడా కొడుకు అఖిలేష్ తో పడటం లేదు. తండ్రిని అఖిలేష్ పార్టీ వ్యవహారాల్లో అసలు వేలు పెట్టనీయటం లేదు. ఏదో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడని, మాజీ ముఖ్యమంత్రని, ఎంపీ అని మాత్రమే పార్టీ నేతలు ములాయంకు గౌరవమిస్తున్నారు.

పార్టీ అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, ప్రచారం అన్నీ తనిష్ట ప్రకారమే అఖిలేష్ చేస్తున్నారు. నిజానికి ములాయం పార్టీలో ఉన్నా లేనట్లే లెక్క. అందుకనే ఎన్నికల హీట్ అంతగా పెరిగిపోతున్నా ములాయం మాత్రం హ్యాపీగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల పేరుతో ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క మాట కూడా తండ్రితో అఖిలేష్ మాట్లాడటం లేదట. అందుకనే చేసేదేమీ లేద ఒళ్ళు మండిపోయిన ములాయం కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తానికి అఖిలేష్ ప్రత్యర్ధులు వచ్చి ములాయం ఆశీసులు తీసుకుంటుండటమే విచిత్రంగా ఉంది.