Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్యే వార్‌.. ఇందుకేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 7:42 AM GMT
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్యే వార్‌.. ఇందుకేనా?
X
సకాలంలో ప్రతి నెలా 1నే జీతాల చెల్లింపు, 11, 12 పీఆర్సీలు అమలు, డీఏ, జీపీఎఫ్‌ బకాయిలు విడుదల, డీఏ పెంపు వంటివాటిపై పోరాటం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమలో తాము కలహించుకుంటున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవోస్‌ సంఘం, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇలా అన్ని సంఘాలు తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాయి. అయితే ఈసారి విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉద్యోగ సంఘాలు ఒకదానిపై ఒకటి తీవ్ర మాటల యుద్ధానికి దిగుతున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, తదితరులు హెచ్చరించారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమై తమ డిమాండ్లను ముందుకు తీసుకురావడంతో ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని పేరున్న కొన్ని ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై మండిపడుతున్నాయి. వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేయడంతోపాటు ఆ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కారరావుపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కాకర్ల వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.

రాష్ట్రంలో 11 పీఆర్‌సీలను సాధించిపెట్టింది తమ 77 ఏళ్ల సంస్థేనని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తమ సంస్థే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 11 పీఆర్‌సీలను సాధించిందన్నారు. తక్షణమే సమ్మె ప్రారంభించి ప్రభుత్వ సిబ్బంది సంక్షేమానికి నిబద్ధతతో కృషి చేస్తే ఏపీ ఎన్జీవోలు మీతో కలుస్తారని బండి శ్రీనివాసరావు.. సూర్యనారాయణకు సవాల విసిరారు.

తమ సంస్థ ప్రభుత్వానికి అనుకూలమని ముద్ర వేసినందుకు ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు... సూర్యనారాయణపై మండిపడ్డారు. " ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కొన్ని కనిపించని శక్తులు నడిపిస్తున్నాయి. మా ఎన్జీవోల సంఘం వెనుక ఎలాంటి శక్తులు లేవు" అని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలపై సూర్యనారాయణ స్పందిస్తూ.. తమ సంస్థ వెనుక ఉద్యోగుల మనోభావాలు, ఆకాంక్షలు తప్ప మరెవరూ లేరని అన్నారు. 'ఏప్రిల్‌ నుండి మా కార్యాచరణ ప్రణాళికను చేపడతామని మేము ఇప్పటికే ప్రకటించాము, కాబట్టి ఏపీ ఎన్జీవోలు వెంటనే సమ్మెను ప్రారంభించమని సవాలు చేయవలసిన అవసరం లేదు' అని ఆయన అన్నారు.

"మేము గవర్నర్‌ను కలిశాము. చట్టం ప్రకారం ఉద్యోగులకు సరైన చెల్లింపులు చేయడానికి ఒక దరఖాస్తును సమర్పించాము. నేను దీనిని చట్టవిరుద్ధమైన విషయంగా చూడను" సూర్యనారాయణ తేల్చిచెప్పారు.

2014 నుంచి 2019 వరకు తమ అసోసియేషన్‌కు గుర్తింపు రాకుండా ఇతర ఉద్యోగుల సంఘాలు, ఏపీఎన్జీవో సంఘం అడ్డంకులు సృష్టించాయని సూర్యనారాయణ ఆరోపించారు. .

ఏపీఎన్జీవోల సంఘం .. తమ సంఘానికి గుర్తింపు విషయమై సీఎంకు ఫిర్యాదు చేసిందని సూర్య నారాయణ గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఎలాంటి లొసుగులు లేవని ప్రభుత్వం వారి ఆరోపణలను కొట్టివేసిందన్నారు. వారు హైకోర్టులో పిల్‌ కూడా దాఖలు చేశారని, ఈ కేసు ఇంకా విచారణలో ఉందని గుర్తు చేశారు.

కాగా సర్వీసు రూల్స్‌ ను ధిక్కరించి గవర్నరుకు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, తదితరులపై చర్యలు తీసుకోవాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.