Begin typing your search above and press return to search.

ఎలాన్‌ మస్క్, పరాగ్‌ అగర్వాల్‌ మధ్య ‘ట్విట్టర్‌’ వార్‌

By:  Tupaki Desk   |   17 May 2022 4:36 PM GMT
ఎలాన్‌ మస్క్, పరాగ్‌ అగర్వాల్‌ మధ్య ‘ట్విట్టర్‌’ వార్‌
X
భారత కరెన్సీలో రూ. 3,30,000 కోట్లతో ట్విట్టర్‌ కొనుగోలుకు ముందుకొచ్చిన స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ టేకోవర్‌కు ఇప్పుడు మొరాయిస్తున్నాడు. ఫేక్‌ ఖాతాల విషయంలో ట్విట్టర్‌ నుంచి తనకు సరైన సమాచారం ఇవ్వడం లేదని.. అందువల్ల టేకోవర్‌ చేయడం కుదరదని మొండికేస్తున్నాడు. మొత్తం ట్విట్టర్‌ ఖాతాల్లో 20 శాతం వరకు ఫేక్‌ ఖాతాలే ఉన్నాయని ఎలాన్‌ మస్క్‌ ఆరోపిస్తున్నాడు.

అయితే ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ వాదన మాత్రం మరోలా ఉంది. ట్విట్టర్‌ మొత్తం ఖాతాల్లో కేవలం 5 శాతం మాత్రమే ఫేక్‌ ఖాతాలు ఉంటాయని అంటున్నాడు. ఈ ఫేక్‌ ఖాతాలను తొలగించడానికి తాము ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నామని చెబుతున్నాడు. అయితే వ్యక్తులు నిత్యం రకరకాల ఫేక్‌ పేర్లతో ట్విట్టర్‌లో ఖాతాలు తెరుస్తున్నారని అంటున్నాడు. ఈ ఫేక్‌ ఖాతాలను కనుక్కుని వెంటనే వాటిని తొలగించడం సాధ్యం కాదని పేర్కొంటున్నాడు. ఎన్ని ఫేక్‌ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి బయట వ్యక్తులను అనుమతించబోమని పరాగ్‌ చెబుతుండటం వివాదాన్ని హీటెక్కిస్తోంది.

ట్విటర్‌లో స్పామ్‌ అకౌంట్ల ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు బయటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇవ్వడం వీలు పడదో వివరిస్తూ పరాగ్‌ అగర్వాల్‌ అనేక ట్వీట్‌లు చేశాడు. అయితే వాటన్నింటికి వ్యంగ్యంగా స్పందిస్తూ ఒక ఎమోజీని పరాగ్‌ అగర్వాల్‌ ట్వీట్‌కు రిప్లైగా ఇచ్చాడు.. ఎలాన్‌ మస్క్‌.

పరాగ్‌ అగర్వాల్‌ వాదనతో ఎలాన్‌ మస్క్‌ అంగీకరించడం లేదు. ట్విట్టర్‌ ఖాతాల్లో 5 శాతం మాత్రమే ఫేక్‌ ఖాతాలని పరాగ్‌ చెబుతున్నదానితో తాను ఏకీభవించనని మస్క్‌ అంటున్నాడు. పరాగ్‌ చెప్పినదాని కంటే నాలుగు రెట్లు అధికంగా అంటే 20 శాతం వరకు ఫేక్‌ ఖాతాలు ట్విట్టర్‌లో ఉన్నాయని మస్క్‌ చెబుతున్నాడు. ఫేక్‌ ఖాతాల అంశం తేలే వరకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసేది లేదని మస్క్‌ అంటున్నాడు. అయితే ఈ విషయాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా చెబుతున్నాడు.

ట్విట్టర్‌లో నిజమైన ఖాతాదారుల సంఖ్యను బట్టే తాను ట్విట్టర్‌ కొనుగోలుకు 44 బిలియన్‌ డాలర్లు చెల్లించడానికి ముందుకొచ్చినట్టు ఎలాన్‌ మస్క్‌ తెలిపాడు. పరాగ్‌ అగర్వాల్‌ చెప్పినదాని కంటే నాలుగు రెట్లు అధికంగా అంటే 20 శాతం ఫేక్‌ ఖాతాలు ఉన్నాయంటున్నాడు. తాను ట్విట్టర్‌ కొనుగోలుకు ముందుకు రావాలంటే ఈ ఫేక్‌ ఖాతాలపై పూర్తి స్థాయి స్పష్టత రావాల్సిందేనని తేల్చిచెబుతున్నాడు. అప్పటివరకు ట్విట్టర్‌ టేకోవర్‌ డీల్‌లో అడుగు కూడా ముందుకు పడదంటూ ఖరాఖండీగా చెప్పాడు. 20 శాతం ఫేక్‌ ఖాతాలు ఉన్న సంస్థకు అంత డబ్బు పెట్టి కొనేది లేదని బల్లగుద్ది చెబుతున్నాడు.

ఈ ట్విట్టర్‌ ఫేక్‌ ఖాతాలకు సంబంధించి ఎలాన్‌ మస్క్, పరాగ్‌ అగర్వాల్‌ మధ్య ట్వీట్ల రూపంలో వార్‌ నడుస్తోంది. ఇందుకు వివాదానికి మూలకారణమైన ట్విట్టరే వేదికగా నిలవడం గమనార్హం. దీంతో ట్విట్టర్‌ టేకోవర్‌ డీల్‌ ఇక అటకెక్కినట్టే అనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.