Begin typing your search above and press return to search.

యుద్ధం క్రికెట్ మ్యాచ్ ఎంత‌మాత్రం కాదు బాస్‌!

By:  Tupaki Desk   |   28 Feb 2019 5:11 AM GMT
యుద్ధం క్రికెట్ మ్యాచ్ ఎంత‌మాత్రం కాదు బాస్‌!
X
యుద్ధం అన్న‌ది క్రికెట్ మ్యాచ్ లాంటిద‌ని వాదించే వారు క‌నిపిస్తారు. కానీ.. ఇది క్రికెట్ మ్యాచ్ ఎంత‌మాత్రం కాదు. యుద్ధంలో గెలుపు.. ఓట‌ములు అంటూ ఏమీ ఉండ‌వు. ఒక‌వేళ ఉన్నాయ‌ని అనుకుంటే అది వారి ఆత్మ సంతృప్తి త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌దు. యుద్ధంలో గెలిచినోడు ఇంటికెళ్లి బాధ‌ప‌డితే.. ఓడినోడు బ‌య‌టే బాధ ప‌డ‌తాడు. ఎందుకంటే.. యుద్ధంలో ప్ర‌త్య‌ర్థిపై విజ‌యం సాధించినా.. ఆ విజ‌యానికి అన్నో ఇన్నో బ‌లిదానాలు త‌ప్ప‌నిస‌రి. మ‌రి.. అన్ని బ‌లిదానాల త‌ర్వాతే వ‌స్తుంద‌న్న విష‌యాన్ని అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు.

ఎందుకిలా అంటే.. పుల్వామా ఉగ్ర‌దాడికి బదులు తీర్చుకోవ‌టానికి పాక్ అక్ర‌మిత క‌శ్మీర్‌.. పాక్ లోని జేష్ ఏ మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన శిక్ష‌ణ శిబిరాల్ని నేల‌మ‌ట్టం చేసేందుకు భార‌త వైమానిక ద‌ళం మెరుపుదాడుల్ని నిర్వ‌హించింది. ఈ ఉదంతం బ‌య‌ట‌కురాగానే భారీ ఎత్తున సంబ‌రాలు మొద‌ల‌య్యాయి.

సోష‌ల్ మీడియాలో పాక్ ను ఉద్దేశిస్తూ ప‌లు జోకులు పుట్టుకొచ్చాయ్. భార‌త వీర‌త్వాన్ని ప్ర‌స్తావిస్తూ అతిశ‌యంతో అయినా.. కొంద‌రు విప‌రీతంగా పొగిడేశారు. ఇలాంటివి స‌రైన‌వి కాకున్నా.. వారించే ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌లేదు. ఎందుకంటే.. అలాంటి వారింపు చేసినోళ్ల‌కు దేశ‌భ‌క్తి లేద‌న్న భావ‌న పుట్టుకొస్తుంది. అదేమంత క్షేమ‌క‌రం కాద‌న్న ఉద్దేశంతో కొంద‌రు కామ్ గా ఉండే ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. బుధ‌వారం ఉద‌యం నుంచి కాస్త భిన్న అనుభ‌వం ఎదురైంది. భార‌త గ‌గ‌న‌త‌లంలోకి పాక్ యుద్ధ విమానాలు దూసుకురావ‌టం.. బాంబులు వేయ‌టం.. వాటిని త‌రిమి కొట్టేందుకు భార‌త వైమానిక ద‌ళం రంగంలోకి దిగాయి. అయితే.. ఈ సంద‌ర్భంగా రెండు యుద్ధ విమానాలు కూలిపోయాయి. వాటిని తామే కూల్చేసిన‌ట్లుగా పాక్ ప్ర‌చారం చేసింది. ఒక యుద్ధ విమానాన్ని కూల్చ‌ట‌మే కాదు.. అందులోని పైలెట్ ను బంధీగా ప‌ట్టుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీన్ని భార‌త్ కాదంది. కానీ.. కొద్ది గంట‌ల‌కే ఆ యుద్ధ పైలెట్ కు చెందిన వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. దీంతో.. బార‌త్ నుంచి.. అవును.. మా యుద్ధ పైలెట్ క‌నిపించ‌టం లేద‌న్న ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఊహించ‌ని రీతిలో బుధ‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో భార‌తీయుల్లో కాసింత నిరాశ‌..నిస్పృహ‌లు చోటు చేసుకున్నాయి.

తాము మొన‌గాళ్లుగా భావించిన భార‌త వైమానిక ద‌ళానికి చెందిన యుద్ధ పైలెట్ దొరికిపోవ‌టం ఏమిట‌న్న బాధ‌.. ఏలా రియాక్ట్ కావాలో అర్థం కాని ప‌రిస్థితి.

ఇక్క‌డ చెప్పేదేమంటే.. రియ‌ల్ ఎప్పుడు రీల్ మాదిరి ఉండ‌దు. అంత కార్గిల్ వార్ లోనూ.. దేశం కోసం ప్రాణాలు విడిచిన వీరులెంద‌రో. పాక్ మీద విజ‌యం సాధించినా.. ఆ విజ‌యం వెనుక ప‌లువురి ప్రాణ‌త్యాగం ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. యుద్ధంలో గెలుపు ఓట‌ములు అంటూ ఏమీ ఉండ‌దు. అదంతా ఆత్మ‌సంతృప్తి మాత్ర‌మే.

అస‌లు ఇప్ప‌టికి యుద్ధ‌మే మొద‌లుకాలేదు.. ఎందుకిలా అంటే.. దాడి.. ప్ర‌తిదాడి ఇలా పేర్లు ఏమైనా స‌రే.. యుద్ధానికి సంబంధించిన అంశాలే. అలాంటి వేళ‌ల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. రోజూ మ‌న‌దే పైచేయిగా ఉండ‌ద‌ని చెప్ప‌ట‌మే ఉద్దేశం. ప్ర‌త్య‌ర్థిపై పైచేయిగా ఉన్న‌ప్పుడు కేరింత‌లు కొట్టటం.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు జావ‌కారిన‌ట్లుగా డీలా ప‌డ‌టం మంచిది కాదు. న్యాయం కోసం.. ధ‌ర్మం కోసం.. మ‌న ఉనికి కోసం పోరాడే వేళ‌లో కొన్ని స‌వాళ్లు ఎదుర‌వుతాయి. అందుకు కొన్ని బ‌లిదానాలు త‌ప్ప‌నిస‌రి. ఆ క‌ఠిన వాస్త‌వం తెలిసి ఉంటే స‌రిపోతుంద‌ని చెప్ప‌ట‌మే ఈ అక్ష‌రాల ఉద్దేశం.