Begin typing your search above and press return to search.

మల్లన్నా.. నిన్ను చంపే దమ్ము ఎవడికుందన్నా?

By:  Tupaki Desk   |   30 May 2022 7:46 AM GMT
మల్లన్నా.. నిన్ను చంపే దమ్ము ఎవడికుందన్నా?
X
రెడ్ల పంచాయితీ రచ్చకు దారితీస్తోంది. మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వార్ ముదిరిపాకాన పడుతోంది. ఇటీవల 'రెడ్ల' సింహగర్జనకు ఈ మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిలు హాజరై తమ పరోక్ష ఐక్యత చాటారు. కానీ పార్టీలు వేరు కావడంతో బయట మాత్రం తిట్టుకుంటున్నారు. మల్లారెడ్డి భూబాగోతాలను రేవంత్ రెడ్డి తీయడం.. రేవంత్ రెడ్డిని బండ బూతులు తిట్టడం మల్లారెడ్డికి అలవాటే..

తాజాగా అధికార పార్టీ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో ఆదివారం రెడ్ల సింహగర్జన సభ జరిగింది. సొంత జిల్లా కావడం.. పైగా సొంత సామాజికవర్గం కావడంతో మంత్రి మల్లారెడ్డి వెళ్లి ప్రసంగించారు. అయితే మంత్రికి షాక్ తగిలింది. కొందరు కార్యకర్తలు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం వేదిక దిగి వెళ్లిపోతున్న మంత్రిని వెంబడించారు. మంత్రి వాహనాలపై కుర్రీలు, చెప్పులు విసిరారు. పోలీసులు చెదరగొట్టి మంత్రి మల్లారెడ్డిని సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 'రెడ్ల సింహగర్జన' సభలో తనపై దాడి చేసేందుకు కుట్ర చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించడం సంచలనమైంది. తనను హత్య చేసేందుకు ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు.

హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు రెడ్లకు అందుతున్నాయని సభలో చెప్పానన్నారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడుతామన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మల్లారెడ్డి తెలిపారు.

అధికార పార్టీ మంత్రి అయ్యి ఉండి ఒక సభలో ఇంతటి వ్యతిరేకతను మల్లారెడ్డి తెచ్చుకోవడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే మల్లారెడ్డి కూడా అదే రెడ్డి సామాజికవర్గం. వారి సొంత మహాసభలో ఇంతటి పరాభవం కలిగిందంటే మల్లారెడ్డి ఖచ్చితంగా దీన్ని పునరాలోచన చేసుకోవాలి. సొంత వారు కూడా ఎంతలా వ్యతిరేకిస్తున్నారంటే ఆయన వ్యవహారశైలి, సంక్షేమం, పాలన , నోటిదురుసు విషయంలో ఇప్పటికైనా జాగ్రత్త పడాలని.. రెచ్చగొట్టేలా మాట్లాడి అభాసుపాలు కావద్దని ఆ వర్గం వారు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా రెడ్డిల విషయంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉండడం.. ఆయననే మంత్రి మల్లారెడ్డి టార్గెట్ చేయడంతో కొందరు తట్టుకోలేకపోయారు. మంత్రి మల్లారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దాన్ని కూడా రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి నెట్టి రాజకీయం చేయాలని చూడడం షాకింగ్ గా మారింది. ఇప్పటికైనా ప్రజల మనోభావాలకు అనుగుణంగా మల్లారెడ్డి వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.