Begin typing your search above and press return to search.

మ‌హిళా మంత్రికి, ఎమ్మెల్యేకు పొస‌గ‌ట్లేదు

By:  Tupaki Desk   |   18 July 2016 8:04 AM GMT
మ‌హిళా మంత్రికి, ఎమ్మెల్యేకు పొస‌గ‌ట్లేదు
X
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో విబేధాలు పొడ‌సూపుతున్నాయి. పార్టీ మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే అన్న‌ట్లుగా వాదోప‌వాదాలు సాగాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే ఇద్ద‌రు మ‌హిళామ‌ణులే కావ‌డం గ‌మ‌నార్హం. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ స‌న్నివేశాలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రగ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని హాజరయిన ఈ సమావేశం వాడీగావేడిగా సాగినట్లు స‌మాచారం. సమావేశంలో మంత్రి మృణాళిని తీరుపై ఎమ్మెల్యే మీసాల గీత ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీవర్గాలు అంటున్నాయి. త‌న నియోజకవర్గంలో మంత్రి ప‌ర్య‌టించే విష‌యం ఎమ్మెల్యే అయినప్ప‌టికీ త‌న‌కు తెలియ‌క‌పోవ‌డం విచిత్రంగా ఉంద‌ని గీత అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కేవ‌లం ప‌ర్య‌టించ‌డ‌మే కాకుండా ఆసుపత్రులు - పాఠశాలల తనిఖీ సమయంలో త‌న‌కు సమాచారం లేకపోవడం ఏమిట‌ని ఆమె విస్మ‌యం వ్య‌క్తం చేశారు. మంత్రి వ‌స్తున్న విష‌యం చెబితే తాము సైతం హాజరవుతామని పేర్కొన్నారు. దీంతో మ‌రోమారు ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని పార్టీ సీనియ‌ర్లు తెలిపారు.

ఇదిలాఉండ‌గా గడపగడపకూ వైకాపా కార్యక్రమంపై సమావేశంలో హాట్ హాట్‌ గా చర్చసాగింది. ఈ కార్య‌క్ర‌మంలో వైకాపా నేతల ఆరోపణలపై స్థానిక తెదేపా నేతలు స్పందించకపోవడాన్ని నాయ‌కులు ప్ర‌స్తావించారు. ఎవ‌రికి వారు మిన్న‌కుంటున్నార‌ని పార్టీ అగ్ర‌నేత‌లు త‌ప్పుప‌ట్టారు. అయితే దీనిపై నాయ‌కులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పార్టీ ముఖ్యులు త‌మ‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తే స్పందించేందుకు మార్గం సుగ‌మం అవుతుంద‌ని తెలిపారు. ముఖ్య నేత‌లే ప‌ట్టిప‌ట్ట‌న‌ట్లు ఉంటే ఎలాగ‌ని వారు నిల‌దీయ‌డంతో సీనియ‌ర్లు మౌనం వ‌హించారు.