Begin typing your search above and press return to search.

టీకాంగ్రెస్‌ లో యుద్ధాలు

By:  Tupaki Desk   |   27 Jan 2018 5:25 AM GMT
టీకాంగ్రెస్‌ లో యుద్ధాలు
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని ఆ పార్టీ నాయకులు - సర్వేలు చెప్తున్నాయి.. అయితే అదేసమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకులు పుంజుల్లా కొట్లాడుకుంటున్నారని తాజా పరిణామాలు చెప్తున్నాయి. అంతేకాదు... కాంగ్రెస్ పార్టీలు పది మంది నేతలు ఒక చోట చేరితే అక్కడ కొట్లాటే తప్ప చర్చ జరగడం లేదట. పైగా... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప మిగతావారంతా మాట్లాడేవారేనని అంటున్నారు. తాజాగా గాంధీభవన్‌ లో కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకున్న విషయం ఆ పార్టీలో పెద్ద ఇష్యూగా మారింది.

గాంధీభవన్‌ లో శుక్రవారం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టి.పిసిసి ప్రధాన కార్యదర్శి టి. నిరంజన్ - మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ళ శారద తీవ్రస్థాయలో వాదులాడుకున్నట్లు సమాచారం. రిపబ్లిక్-డే సందర్భంగా టి.పిసిసి చీఫ్ ఎన్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో ఏఐసిసి నాయకుడు - మాజీ ఎంపి వి హనుమంత రావు మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్న తీరు బాగా లేదు కాబట్టి ఇకమీదట గవర్నర్‌ ను కలిసి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వరాదని భావించామని - అయినా పార్టీ నాయకులు గురువారం ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. శాసనమండలి (కౌన్సిల్) లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ - ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి గవర్నర్‌ ను కలిసి వినతి పత్రం అందించిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా విహెచ్ వ్యాఖ్య ల పట్ల సమావేశంలో పాల్గొన్న నాయకులు కొందరు ఏకీభవించారని తెలిసింది. కాగా షబ్బీర్ అలీ మాత్రం తాము వినతి పత్రం ఇవ్వలేదని - క్యాబినెట్ ర్యాంకు ఇచ్చిన టిఆర్‌ ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పామని - ఇది చాలా ముఖ్యమైన అంశమని చెప్పినట్లు తెలిసింది.

అదేసమయంలో సమావేశానికి వచ్చిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద... తాను వచ్చే నెలలో మహబూబ్‌ నగర్‌ లో నిర్వహించబోయే మహిళా సాధికారత సదస్సు కు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు - ఇతర ప్రముఖులు హాజరవుతారు కాబట్టి పార్టీ నాయకులందరూ హాజరు కావాలని కోరారు. అందుకు విహెచ్ కల్పించుకుని ‘సహకారం ఉంటుంది కానీ మీరు ముందుండాలి కదమ్మా..’ అని అన్నారట. దానికి శారద స్పందిస్తూ తాను ఏర్పాట్లలో కొంత బిజీగా ఉండి సమావేశానికి ఆలస్యంగా వచ్చానని - తాను ఎంత కష్టపడినా తననే అంటుంటారని వాపోయారు. ఈ దశలో టి.నిరంజన్ కల్పించుకోవడంతో ఆమెకు నిరంజన్‌ కు మధ్య మాట-మాట పెరిగి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు చెప్తున్నారు. చివరకు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కల్పించుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నిరంజన్ కోపంతో సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.