Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి వ‌ర్గంపై ఎమ్మెల్యే వ‌ర్గం వేట క‌త్తుల‌తో దాడి చేసిందా?

By:  Tupaki Desk   |   28 July 2022 9:37 AM GMT
మాజీ మంత్రి వ‌ర్గంపై ఎమ్మెల్యే వ‌ర్గం వేట క‌త్తుల‌తో దాడి చేసిందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు.. జ‌మ్మ‌ల‌మడుగు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైఎస్సార్సీపీలో వ‌ర్గ పోరు మొద‌ల‌యింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాకుండా ఒక వ‌ర్గంపై మ‌రొక వ‌ర్గం వేట క‌త్తుల‌తో దాడుల‌కు దిగ‌డం హాట్ టాపిక్ అయ్యింద‌ని చెబుతున్నారు.

క‌డ‌ప జిల్లాలో ఉన్న మొత్తం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున సుధీర్ రెడ్డి గెలుపొందారు. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రామ‌సుబ్బారెడ్డిపై సుధీర్ రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. రామసుబ్బారెడ్డి గ‌తంలో టీడీపీ హయాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే 2004 నుంచి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగుసార్లు ఓడిపోయారు. 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డిపై ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గెలిచిన ఆదినారాయ‌ణ‌రెడ్డి ఆ త‌ర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. అయినా స‌రే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున నారాయ‌ణ‌రెడ్డికి పోటీ చేసే అవ‌కాశం రాలేదు. రామసుబ్బారెడ్డే బ‌రిలోకి దిగారు. తొలిసారిగా పోటీ చేసిన సుధీర్ రెడ్డిపై ఓడిపోయారు. అయితే ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో రామ సుబ్బారెడ్డి టీడీపీని వ‌దిలిపెట్టి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అప్ప‌టి నుంచి ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌లేవ‌న్న‌ట్టు అటు రామ‌సుబ్బారెడ్డి, ఇటు సుధీర్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మీద పెత్త‌నం కోసం ప్ర‌య‌త్నించ‌డంలో వ‌ర్గ విభేదాలు రాజుకున్నాయ‌ని స‌మాచారం.
ఈ నేప‌థ్యంలో జూలై 27న‌ రామసుబ్బారెడ్డి వర్గంపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గం వేట క‌త్తుల‌తో దాడికి దిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో పలువురికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని అని చెబుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

దీంతో రామసుబ్బారెడ్డి అనుచరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే ద‌గ్గ‌రుండి త‌న అనుచ‌రుల‌తో హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

గ‌తంలో రామ సుబ్బారెడ్డి టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి మ‌ధ్య విభేదాలను పార్టీ పెద్ద‌లు శాంతింప‌జేశారు. ఇరువురూ క‌ల‌సి న‌డ‌వాల‌ని సూచించారు. అలాగే రామ సుబ్బారెడ్డిని క‌లుపుకుపోవాల‌ని ఎమ్మెల్యేను ఆదేశించారు. అయినా పార్టీ పెద్ద‌ల ఆదేశాల‌ను ఇరువురు నేత‌లు పాటించ‌క‌పోవ‌డంతో వేట క‌త్తుల‌తో నరుక్కునేవర‌కు వ‌చ్చింద‌ని చెబుతున్నారు.