Begin typing your search above and press return to search.

జీ-20 వేదికపై జెలెన్ స్కీ ప్రసంగించే వేళలో ఉక్రెయిన్ లో అంత ఆరాచకం!

By:  Tupaki Desk   |   16 Nov 2022 3:59 AM GMT
జీ-20 వేదికపై జెలెన్ స్కీ ప్రసంగించే వేళలో ఉక్రెయిన్ లో అంత ఆరాచకం!
X
వారం.. మహా అయితే రెండు వారాల్లో ఉక్రెయిన్ ను సొంతం చేసుకోవచ్చన్న తలంపుతో దాడికి దిగిన రష్యాకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ సొంతమయ్యే సంగతి పక్కన పెడితే.. ఆ దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి దారుణంగా తయారవుతోంది.

అలా అని.. మధ్యలో దాడుల్ని ఆపేస్తే.. ప్రపంచం ముందు తమ దేశానికి జరిగే డ్యామేజీని గుర్తు తెచ్చుకొని మరీ తానేమిటో చూపించాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా జీ20 దేశాల వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆన్ లైన్ వేదికగా మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్యా దమనకాండ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. దాడుల్ని ఆపాల్సిందిగా కోరారు. ఉక్రెయిన్ అధ్యక్షుల వారు ఆన్ లైన్ వేదికగా చేసుకొని జీ20 దేశాల సదస్సులో ప్రసంగించటంపై రష్యా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనికి మాటలతో కాకుండా చేతలతో చూపించే ప్రయత్నం చేసింది. మంగళవారం ఉక్రెయిన్ పై రష్యా సేతలు భీకరంగా విరుచుకుపడ్డాయి. క్షిపణుల వర్షాన్ని కురిపించాయి. దీంతో.. భారీగా జరిగిన ఆస్తినష్టంతో పాటు.. ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు.

దేశ రాజధాని కీవ్ తో పాటు పలు నగరాల్లో అత్యవసర సైరన్లు మోగి.. ప్రజలంతా సురక్షితంగా ఉండాలన్న సంకేతాల్ని వెల్లడించాయి. కీవ్ లోని పెచెర్స్క్ డిస్టిక్ పై జరిగిన క్షిపణి దాడుల్లో పెద్ద ఎత్తున నివాస భవంతులు ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు అవుతూ.. అక్కడి యదార్థ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తెలియజేస్తున్నాయి.

తాజాగా జరిగిన క్షిపణి దాడులు రష్యా సేనలు చేసినవే అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుల వారి కార్యాలయం ఒక ప్రకటనలో ఆరోపించింది. కీవ్ తో పాటు ఉక్రెయిన్ లో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కివ్.. ల్విత్ తో సహా పలు చోట్ల తాజా దాడుల కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

తాజా దాడుల లక్ష్యం ఉక్రెయిన్ లోని ఇంధన వసతులే లక్ష్యమని చెబుతున్నారు. ఆ దేశ తూర్పు ప్రాంతంలోని సుమీ.. పశ్చిమ ప్రాంతంలో ఉన్న రిన్నేలో జరిగిన దాడులే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. తాజా దాడులు చూసిన తర్వాత రష్యా నిజంగా శాంతిని కోరుకుంటుందా? అన్న సందేహం ఉంటే తీరిపోతుందంటున్నారు. జీ-20 దేశాల సమ్మిట్ లో జెలెన్ స్కీ మాట్లాడటాన్ని జీర్ణించుకోలేని రష్యా తన ఆగ్రహాన్ని క్షిపణి దాడుల రూపంలో ప్రదర్శిస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.