Begin typing your search above and press return to search.

జ‌ర్మ‌నీ ఫ్రాన్స్ క‌లిశాయి..మ‌న‌మెంత‌

By:  Tupaki Desk   |   29 Nov 2018 6:47 AM GMT
జ‌ర్మ‌నీ ఫ్రాన్స్ క‌లిశాయి..మ‌న‌మెంత‌
X
ఇటీవ‌లే పాక్ ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఇమ్రాన్‌ ఖాన్ శాంతివ‌చ‌నాలు వ‌ల్లిస్తున్నారు. భారత్‌తో బలమైన నాగరిక సంబంధాలను కోరుకుంటున్నామని ఆయ‌న చెప్పారు. కశ్మీర్ సహా తమ మధ్య ఉన్న అన్ని అంశాలనూ ఇరుదేశాలు ఉమ్మడిగా పరిష్కరించుకోగలవని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అన్నారు. పాకిస్థాన్‌ లోని కర్తార్‌ పూర్‌ లో ఉన్న సిక్కుల పవిత్రస్థలం దర్బార్ సాహిబ్‌ కు.. భారత భూభాగంలోని పంజాబ్‌ లో ఉన్న డేరాబాబా నానక్ గురుద్వారాను కలుపుతూ ఇరుదేశాల మధ్య నిర్మించనున్న కర్తార్‌పూర్ కారిడార్‌ కు ఇమ్రాన్‌ ఖాన్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ మార్గం ద్వారా వీసా అవసరం లేకుండానే భారత సిక్కులు పాకిస్థాన్‌ లోని గురుద్వారాను దర్శించుకునేందుకు వీలవుతుంది. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

వందల ఏళ్ల‌పాటు అనేక యుద్ధాల్లో తలపడిన జర్మనీ - ఫ్రాన్స్ దేశాలు ఇప్పుడు స్నేహపూర్వకంగా జీవిస్తున్నప్పుడు.. భారత్ - పాక్ అలా ఎందుకు ఉండలేవు? అని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రశ్నించారు. 70 ఏళ్లుగా దేవుడిచ్చిన అవకాశాలనూ భారత్ - పాకిస్థాన్ రెండూ సరిగా అర్థం చేసుకోలేకపోయాయని ఆయన అన్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం రావాలని మూర్ఖులు మాత్రమే కలలు కంటారని - ద్వేషంతో అందరం దెబ్బతింటామని గుర్తించాలని ఆయన సూచించారు. ``రాజకీయ నాయకులకు కలిసి పనిచేయాలని ఉన్నా.. భారత్-పాక్ మధ్య స్నేహానికి రెండువైపులా ఉన్న సైన్యం అనుమతించడం లేదని నాతో భారతీయ మిత్రులు పలువురు చెప్పేవారు. నేను ఈ వేదికగా ఓ విషయం స్పష్టం చేస్తున్నాను.. ఈ రోజు మా దేశంలోని రాజకీయ పార్టీలు - మా సైన్యం - అన్ని ప్రభుత్వ విభాగాలు ఏకతాటిపై ఉన్నాయి. ఇరుదేశాల మధ్య బలమైన నాగరిక సంబంధాలను కోరుకుంటున్నాయి. మానవుడు చంద్రుడిపైకి వెళ్లగలిగినప్పుడు.. మనం చర్చించి పరిష్కరించుకోలేనంత సమస్యలేముంటాయి? కశ్మీర్‌ ను కూడా మనం పరిష్కరించుకోగలమని నేను నమ్ముతున్నాను`` అని ఇమ్రాన్ తెలిపారు.

ఇరువైపులా తప్పులున్నాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఇంకా గతంలోనే జీవించడం - ఒకరినొకరు నిందించుకోవడం మంచిదికాదని ఆయన చెప్పారు. రెండు దేశాలు స్నేహం దిశగా అడుగు ముందుకు వేయగానే.. ఏదో జరిగి రెండడుగులు వెనక్కిపడుతున్నాయని అన్నారు. భారత్-పాక్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఏర్పడగలిగితే.. ఉపఖండంలో సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. పవ్రిత మదీనాకు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయినవాళ్లను..ఒక్కసారిగా దర్శనానికి అనుమతిస్తే కలిగే సంతోషం.. ఇప్పుడు ఇక్కడకు వచ్చిన సిక్కు మిత్రులందరిలోనూ కనిపిస్తున్నది అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న గురునానక్ 550వ జయంతి వేడుకల కోసం కర్తార్‌ పూర్ గురుద్వారాను మరింత అభివృద్ధి చేస్తామని ఇమ్రాన్ హామీ ఇచ్చారు.