Begin typing your search above and press return to search.

హ‌ద్దులు దాటిన ర‌మేష్, జీవీఎల్ ల భాష‌!

By:  Tupaki Desk   |   17 Oct 2018 9:39 AM GMT
హ‌ద్దులు దాటిన ర‌మేష్, జీవీఎల్ ల భాష‌!
X
రాజ‌కీయ నాయ‌కుల‌న్న త‌ర్వాత ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు స‌హ‌జం. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను, నాయ‌కుల‌ను విమ‌ర్శించ‌డం....ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం స‌ర్వ సాధార‌ణం. అయితే, చాలాకాలంగా రాజ‌కీయ నాయ‌కులు త‌మ సంయ‌మ‌నం కోల్పోవ‌డం....బాధ్య‌త‌ను విస్మ‌రించి ఇష్టారీతిలో జుగుప్సాక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం చూస్తూనే ఉన్నాం. అయితే, లైవ్ డిబేట్లు, షోలలో కూడా కొంద‌రు నేతలు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, అస‌భ్య ప‌ద‌జాలం వాడేందుకు కూడా వెనుకాడ‌డం లేదు. తాజాగా, ఓ లైవ్ డిబేట్ షోలో టీడీపీ రాజ్య‌స‌భ‌ ఎంపీ సీఎం ర‌మేష్ - బీజేపీ రాజ్యస‌భ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావుల మ‌ధ్య వాడీవేడీ చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ చ‌ర్చ సంద‌ర్భంగా ఆ ఇద్ద‌రు ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక‌రినొక‌రు ఆంబోతు అని సంబోధించుకుంటూ తమ స్థాయిని దిగ‌జార్చుకున్నారు. దీంతో, ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యుల భాష హాట్ టాపిక్ అయింది.

వాస్త‌వానికి రాజ్య‌స‌భ అంటేనే చ‌దువుకున్న వారు, కాస్త డిగ్నిఫైడ్ గా ఉండే వారు ఉంటారు. అందుకే దానికి పెద్ద‌ల స‌భ అని పేరు. అటువంటి రాజ్య‌స‌భ స‌భ్యులు అయిన ర‌మేష్, జీవీఎల్ లు హుందాగా నడుచుకోవాల్సింది పోయి....దిగ‌జారుడుగా మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏపీలో కొన్ని ఐటీ కంపెనీల ఏర్పాటు చేసేందుకు గానూ ప్ర‌భుత్వం....ఆ సంస్థ‌ల‌ నుంచి ల‌బ్ధి పొందుతోంద‌ని జీవీఎల్ ఆరోపించారు. దీంతో, ఆ ఆరోప‌ణ‌ల‌ను ర‌మేష్ ఖండించారు. హెచ్ సీఎల్, గూగుల్ వంటి సంస్థలు లంచాలివ్వ‌వ‌ని చెప్పారు. ఏపీకి ఐటీ కంపెనీలు రావ‌డం బీజేపీకి ఇష్టం లేద‌ని, అందుకే త‌మ ప్ర‌భుత్వంపై ప‌డి ఏడుస్తోంద‌ని అన్నారు. ఏపీలో పెట్టుబ‌డుల‌ను బీజేపీ అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు. ఓ ఆంబోతులా జీవీఎల్ ను ఏపీపైకి బీజేపీ వ‌దిలింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో, టీడీపీ ప్ర‌భుత్వం, ర‌మేష్ ను ఆంబోతు అంటూ జీవీఎల్ ప్ర‌తి స్పందించారు. ఆంబోతులా టీడీపీ ప్ర‌భుత్వం ఏపీని దోచుకుంటోంద‌ని ఎద్దేవా చేశారు. రాజ్య స‌భ స‌భ్యులై హుందాగా ప్ర‌వ‌ర్తించాల్సిన ఈ ఇద్ద‌రూ...ఇలా దిగ‌జారి వ్యాఖ్య‌లు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.