Begin typing your search above and press return to search.

ఎంపీ వర్సెస్ ఎంపీ.. రచ్చ పీక్స్

By:  Tupaki Desk   |   6 Feb 2020 10:06 AM GMT
ఎంపీ వర్సెస్ ఎంపీ.. రచ్చ పీక్స్
X
అనంతపురము జిల్లాలో నెలకొల్పిన కియా మోటార్స్ రాష్ట్రం దాటి తమిళనాడుకు వెళ్తుందనే వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాక లోక్ సభను కూడా ఊపేసింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనం తీసుకురాగా దీనిపై లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ పరస్పరం వాగ్వాదం పడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన ఆటో మోబైల్ కంపెనీ కియా ఏపీలోని అనంతపురములో ప్లాంట్ నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ రాష్ట్రంలో మారిన పరిస్థితులు.. తమిళనాడులో ఉన్న అనుకూల వాతావరణంతో తరలిపోనుందని రాయిటర్స్ సంస్థ కథనం ప్రచురించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఈ కథనం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కియా సంస్థలు అలాంటిదేమి లేదన్న వివరణలు, స్పష్టత ఇచ్చినా దీనిపై వివాదం కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఈ అంశంపై లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. సభలో ఈ ఇద్దరు ఎంపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కియా మోటర్స్ రాష్ట్రం దాటి వెళ్లిపోతుందని, ఏపీలో చోటుచేసుకుంటున్న అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో కోరాడు. పెట్టుబడుల కోసం రాష్ట్రాలన్నీ ప్రయత్నాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం మాత్రం భిన్నంగా పాలిస్తోందని ఆరోపించారు. మరో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా దీనిపై నిలదీశారు.

ఈ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించి దీటుగా బదులిచ్చారు. కియా తరలిపోతుందనే వార్త తప్పు అని, అసత్యమని స్పష్టం చేశారు. కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమయం లో వీరిద్దరి వాదోపవాదాలు జరిగాయి. హిందూపురము ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా టీడీపీ ఎంపీల ఆరోపణలపై బదులిస్తూ వారి తీరును ఎండగట్టారు.