Begin typing your search above and press return to search.

బెట్టింగ్‌ కు ఇదే లాస్ట్ చాన్స్‌

By:  Tupaki Desk   |   8 March 2016 10:17 AM GMT
బెట్టింగ్‌ కు ఇదే  లాస్ట్ చాన్స్‌
X
తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న వ‌రుస ఎన్నిక‌ల పోరులో తాజాగా జ‌రిగిన‌ గ్రేటర్‌ వరంగల్‌ - ఖమ్మం నగర పాలక సంస్థ- మహబూబ్‌ నగర్‌ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ‌గా కొన‌సాగుతోంది. ఖమ్మం - వరంగల్‌ - అచ్చంపేటలో ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. బుధవారం ఎన్నికల ఫలితాలు విడుద‌ల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో బెట్టింగ్ రాయుళ్లు తెర‌మీద‌కు వ‌చ్చారు. ప్ర‌చారం భారీగానే సాగిన‌ప్ప‌టికీ పోలింగ్‌ సరళి తగ్గటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఫలితాల విశ్లేషణపై సరైన అంచనాలకు రాలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో బుధవారం వెల్లడికానున్న నేపథ్యంలో అభ్యర్థులు గెలుపోటములపై బెట్టింగుల పర్వం జోరుగా సాగుతోంది.

ఎన్నికల ప్రచారంలో ఓట్లు పొందేందుకుగాను అభ్యర్థులు నానాతిప్పలు పడ్దారు. ప్రచారంలో ఉన్న వేడి పోలింగ్‌ రోజు కనపడకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక్కో కుటుంబానికి నాలుగు పార్టీల వారూ డబ్బులు పంపిణీ చేశారు. దీంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారనేది ఊహించలేకపోతున్నారు. ఫలితాలకు ఒక్కరోజే సమయం ఉండటంతో వివిధ పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న విజయల‌క్ష్మీ ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొన్న క్ర‌మంలో బెట్టింగ్‌లు జోరందుకుంటున్నాయి.

కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై వ‌రంగ‌ల్‌ నగరంలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం. ఏ డివిజన్‌ లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, గెలిస్తే ఎంత తేడాతో గెలుస్తాడు? అంటూ అభ్యర్థుల జయాపజయాలపై బేరీజు వేసు కుని కాయ్ రాజా కాయ్‌ అంటూ పందెం కాస్తున్నట్టు సమాచారం. బెట్టింగుల్లో జిల్లా కేంద్రాల్లోనే కాక జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారుకూడా జిల్లా కేంద్రానికి వచ్చి లాడ్జీల్లో మకాం వేసి బెట్టింగులు కాస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా బెట్టింగ్ ఈరోజు చివ‌రి చాన్స్ అన్న‌మాట‌. ఎందుకంటే రేపు ఎలాగూ ఫ‌లితాలు వ‌చ్చేస్తాయ్ క‌దా.